షమీపై విచారణకు రంగం సిద్ధం చేస్తోన్న బీసీసీఐ

Posted By:
CoA asks ACU to investigate fixing charges against Mohammed Shami

హైదరాబాద్: షమీ భార్య ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ అతనిపై విచారణ జరపాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మొహ్మద్ షమీపై బీసీసీఐ అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది. షమీ భార్య హసీన్ జహాన్ అతనిపై చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని బోర్డు ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక యూనిట్(ఏసీయూ)ను బీసీసీఐ కోరింది.

సుప్రీం కోర్టు నియమిత పాలక కమిటీ(సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్, ఏసీయూ హెడ్ నీరజ్ కుమార్‌కు బుధవారం ఉదయం ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపారు. అతడిపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపి వారంలోగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ-మెయిల్‌ను బీసీసీఐలోని ఆఫీస్ బేరర్లతో పాటు సీఈవో రాహుల్ జోహ్రీకి కూడా పంపారు.

మొహమ్మద్ షమీ గతంలో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, ఇంగ్లాండ్‌కు చెందిన మహ్మద్ భాయ్‌తో ఒప్పందం మేరకు కోల్‌కతాలో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి అలిస్‌బా నుంచి అతడు డబ్బును కూడా తీసుకున్నాడని హసీన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ రెండు పేర్లను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించనున్నారు. జహాన్ సోషల్‌మీడియా వేదికగా కొన్ని ఆధారాలు బయటపెట్టడంతో పాటు కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసేటప్పుడు కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా సమర్పించింది.

మహ్మద్‌భాయ్ అనే వ్యక్తి అలీస్‌బా ద్వారా షమీకి డబ్బును పంపించాడా? పంపిస్తే ఏ ఉద్దేశం కింద అతడు ఆ డబ్బును తీసుకున్నాడు? వాళ్లతో షమీకి గల సంబంధం ఏంటీ? అనే కోణాల్లో బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ దర్యాప్తు చేయనుంది. ఒకవేళ షమీ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే అతని క్రికెట్ కెరీర్ ముగియడంతో పాటు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Story first published: Wednesday, March 14, 2018, 14:26 [IST]
Other articles published on Mar 14, 2018
Read in English: Shami under ACU scanner

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి