ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. వాంఖడే వేదికగా గురువారం ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గట్టెక్కింది. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత్ ఆపసోపాలు పడింది. జాకోబ్ బెతెల్ విధ్వంసకర శతకంతో టీమిండియా వెన్నులో వణుకు పుట్టించాడు. దాంతో ఈ మ్యాచ్ గెలిచినా.. ఫైనల్లో అడుగుపెట్టినా.. గెలిచిన తీరు మాత్రం సంతృప్తినివ్వడం లేదు. ఎందుకంటే 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దాంతో ఈ మ్యాచ్ ఏకపక్షమే అని అంతా అనుకున్నారు.
కానీ భారత స్పిన్నర్లపై సిక్సర్లతో విరుచుకుపడిన జాకోబ్ బెతెల్ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. విల్ జాక్స్‌తో కలిసి అతను చెలరేగిన తీరుతో ఇంగ్లండ్ విజయం లాంఛనమేనని అభిప్రాయం కలిగింది. అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్‌తో విల్ జాక్స్ వెనుదిరిగినా.. 77 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదించినా.. విజయంపై భారత్‌కు భరోసా లేదు.

బుమ్రా 18వ ఓవర్ వేయడానికి ముందు వరకు విజయంపై ధీమా లేదు. ఓటమి భయమే ఎక్కువగా కనిపించింది. మన బౌలింగ్ డొల్లతనాన్ని ఈ మ్యాచ్ బట్టబయలు చేసింది. బుమ్రాను మినహాయిస్తే.. మరే బౌలర్ రాణించలేకపోయాడు. దాంతో ఎవరికి ఓవర్ ఇస్తే ఏమవుతుందో అని కంగారు పడే పరిస్థితి కనిపించింది. ఈ ప్రపంచకప్ ముందు వరకు ప్రత్యర్థి బ్యాటర్లు ఛేదించలేని మిస్టరీ స్పిన్నర్‌గా కనిపించిన వరుణ్ చక్రవర్తీ... గత నాలుగు మ్యాచ్‌ల్లో తేలిపోయాడు.
ముఖ్యంగా ఈ సెమీస్‌లో మరీ దారుణంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ కెరీర్‌లోనే ఇంతలా పరుగులిచ్చుకోవడం ఇదే తొలిసారి. పేలవ ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్‌ను బౌల్డ్ చేయడం తప్పితే అతను ఈ మ్యాచ్‌లో రాణించింది లేదు. అతను వేసే ప్రతీ బంతి అభిమానుల వెన్నులో వణుకు పుట్టించింది.
అక్షర్ పటేల్ సైతం ప్రభావం చూపలేకపోయాడు. అర్ష్‌దీప్ సింగ్ తేలిపోయాడు. ఎంతలా అంటే అదుపు తప్పి పదే పదే వైడ్స్ సంధించాడు. ఆరంభంలో కట్టడిగా వేసిన హార్దిక్ పాండ్యా.. జాకోబ్ బెతెల్ ధాటికి లయ తప్పాడు. ఒక్క బుమ్రా తప్పా మరే బౌలర్ ప్రభావం చూపలేకపోయారు. శివమ్ దూబే గురించి చెప్పుకోవడం అనవసరం. ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు డిఫెండ్ చేయాల్సిన పరిస్థితుల్లోనూ అతను 21 పరుగులిచ్చుకున్నాడు.
జాకోబ్ బెతెల్ రనౌట్ కాకుంటే.. దూబే బౌలింగ్‌ను అతను చీల్చి చెండాడేవాడు. బుమ్రా చివరి రెండు ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కింది లేదంటే.. ఓటమి తప్పేది కాదు. జట్టులో బుమ్రా తరహా ఇంకో నమ్మదగ్గ బౌలర్ లేకపోవడం భారత జట్టు బలహీనతను బయటపెట్టింది. అంతేకాకుండా ఎక్స్ బౌలర్ ఆప్షన్‌గా శివమ్ దూబేను నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఏ బౌలర్ అయిన మ్యాచ్ మధ్యలో గాయపడితే పరిస్థితి ఏంటి? అనేది ఆందోళనగా మారింది.
ఈ బౌలింగ్‌తో పటిష్టమైన న్యూజిలాండ్‌తో ఫైనల్లో గెలవడం కష్టమనే అభిప్రాయం కలుగుతోంది. న్యూజిలాండ్ జట్టులో ఫిన్ అలెన్ టీమ్ సీఫెర్ట్ వంటి విధ్వంసకారులున్నారు. వీరిని భారత బౌలర్లు ఏ మేర అడ్డుకుంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వరుణ్ పూర్తిగా తేలిపోతున్న క్రమంలో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఎంచుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. మరీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి.!