
ముంబై చేరుకున్న రోహిత్..
రెండో వన్డేలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఢాకాలో ఉన్న ఆస్పత్రిలో అతనికి చికిత్స అందించారు. అయితే స్పెషలిస్ట్ అనాలసిస్ కోసం అతన్ని వెంటనే ముంబై పంపించారు. ఇక్కడ చికిత్స తీసుకున్న తర్వాతనే బంగ్లా టెస్టు సిరీస్‌లో అతను ఆడుతుంది? లేనిదీ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంపై అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం కుదరదని, టెస్టు సిరీస్ నాటికి రోహిత్ అందుబాటులోకి రావొచ్చని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు.

అరంగేట్రంలోనే కుల్దీప్ సేన్..
అదే సమయంలో బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం చేసిన కుల్దీప్ సేన్ కూడా గాయపడ్డాడు. వీపు నొప్పితో బాధపడుతున్న అతనికి రెండో వన్డేలో విశ్రాంతినిచ్చారు. తీరా చూస్తే అతనిది స్ట్రెస్ ఇంజూరీ అని తేలింది. దాంతో ఈ టోర్నీ నుంచి కుల్దీప్ సేన్‌ను తప్పించారు. ఇక మూడో వన్డేల కూడా కుల్దీప్ ఆడబోవడం లేదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా స్పష్టం చేశాడు.

చాహర్ మళ్లీ..
అలాగే మరో పేసర్ దీపక్ చాహర్ కూడా రెండో వన్డేలో గాయపడ్డాడు. ఎడమ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధ పడిన చాహర్.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ మూడో వన్డేలో అతను కూడా ఆడటం లేదని రాహుల్ ద్రావిడ్ తేల్చేశాడు. గాయంతో ఉన్న అతన్ని ఆడించడం కుదరదని చెప్పాడు. ఈ క్రమంలోనే చాహర్, కుల్దీప్ సేన్ ఇద్దరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అసోసియేషన్ (ఎన్సీయే)కు వెళ్లి చికిత్స తీసుకుంటారని తెలుస్తోంది. ఇద్దరూ కోలుకున్న తర్వాత వారి భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నారు.

కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ..
ఈ సిరీస్ ఆరంభానికి ముందే వెన్ను నొప్పితో రిషభ్ పంత్ కూడా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడో వన్డే కోసం కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. గాయాలతో ఉన్న వారి పేర్లు లేకుండా మూడో వన్డేకు జట్టును ప్రకటించింది. పునరాగమనంలో అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో రాణించి, కనీసం కంటి తుడుపు విజయమైనా అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. స్పిన్‌కు సహకరించే బంగ్లా పిచ్‌లపై ఇలాంటి స్పిన్నర్లను పక్కన పెట్టిన సెలెక్టర్లను విమర్శిస్తున్నారు.