న్యూఢిల్లీ: నూతన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)ని బీసీసీఐ ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ వివరాలను బుధవారం వెల్లడించింది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ కమిటీని మాజీ క్రికెటర్లు అశోక్ మల్హోత్ర, జతిన్ పరంజేప్, సులక్షణ నాయక్‌లను తాజాగా భర్తీ చేసింది. ఈ ముగ్గురి సభ్యులతో కూడిన సీఏసీ.. తక్షణమే తమ బాధ్యతలను స్వీకరించనుంది. టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో వేటుకు గురైన చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ స్థానంలో కొత్త సెలెక్షన్ ప్యానెల్‌ను ఎంపిక చేయనుంది.
🚨NEWS: BCCI announces appointment of CAC members.
— BCCI (@BCCI) December 1, 2022
More Details 👇https://t.co/SqOWXMqTsj
డిసెంబర్ 15 వరకు గడువున్న ఈ ప్రక్రియలో ఇప్పటికే దరఖాస్తుల పర్వం ముగిసింది. సుమారు 100 మందికి పైగా ఆశావాహులు సెలెక్టర్ పదవుల కోసం దరఖాస్తు చేశారు. ఈ 100 మంది నుంచి కొత్త సీఏసీ ఐదుగురిని ఎంపిక చేయనుంది. కొత్త సీఏసీకి ఎంపికైన మల్హోత్ర.. భారత్ తరఫున 7 టెస్టులు, 20 వన్డేలు ఆడాడు. జతిన్ టీమిండియాకు 4 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. ఇక సులక్షణ భారత మహిళా క్రికెట్ జట్టులో చాలాకాలం సేవలందించింది. ఆమె తన 11 ఏండ్ల క్రికెట్ కెరీర్‌లో రెండు టెస్టులు, 46 వన్డేలు, 31 టీ20లు ఆడింది.
సెలెక్షన్ కమిటీ ఎంపికతో పాటు జట్టు కోచ్‌లను కూడా ఈ సీఏసీనే ఎంపికచేయాల్సి ఉంటుంది. బీసీసీఐ అనుసరించాలనుకుంటున్న స్ప్లిట్ కోచింగ్‌తో పాటు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదనపై చర్చించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంపై కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత సీఏసీపై ఉంది. ప్రస్తుత కోచ్‌ల పనితీరుపై సమీక్షతో పాటు సెలక్షన్ కమిటీతో రొటేషన్ పాలసీ వంటి విషయాలు చర్చించి వాటిపై బీసీసీఐకి నివేదిక అందజేయాల్సి ఉంటుంది.