T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. అయితే మైదానంలో ఆట మొదలవ్వకముందే ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తన కామెంట్స్‌తో వాతావరణాన్ని వేడెక్కించాడు. ముంబైలో హోరెత్తే భారత అభిమానుల కేకలను ఆపేస్తామంటూ సామ్ కరన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారాయి.
నాడు కమిన్స్.. నేడు శామ్ కరన్
సామ్ కరన్ చేసిన ఈ కామెంట్స్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేస్తున్నాయి. నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లక్ష మందికి పైగా ఉన్న భారత అభిమానులను నిశ్శబ్దంగా మార్చడమే తన లక్ష్యమని చెప్పి.. అన్నంత పని చేసి కప్పును ఎగరేసుకుపోయాడు. ఇప్పుడు అదే తరహాలో సామ్ కరన్, "గురువారం వాంఖడే స్టేడియం నిశ్శబ్దంగా మారుతుందని నాకు నమ్మకం ఉంది" అని పేర్కొన్నాడు. స్టేడియంలో నిశ్శబ్దం నెలకొందంటే దాని అర్థం ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని సామ్ కరన్ ధీమా వ్యక్తం చేశాడు.

భారీ స్కోర్ల వేదికగా వాంఖడే:
వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా పేరుగాంచింది. దీనిపై స్పందిస్తూ.. ఈ సెమీఫైనల్ మ్యాచ్ కూడా హై-స్కోరింగ్ పోరుగా నిలుస్తుందని సామ్ కరన్ అంచనా వేశారు. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉన్నందున సిక్సర్ల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. "మేము ఎవరికీ భయపడము, ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఉత్సాహంతో ఉంది" అని సామ్ కరన్ సూర్యసేనకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు.
సెమీస్ పోరులో హ్యాట్రిక్ రికార్డు:
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో తలపడటం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2022లో ఇంగ్లాండ్ గెలవగా.. 2024లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు 2026లో 'డిసైడర్' లాంటి ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ స్వదేశీ గడ్డపై చెలరేగాలని పట్టుదలతో ఉంది.
బలబలాలు - తుది జట్లు
భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండగా.. బ్యాటింగ్‌లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ వంటి హిట్టర్లు ఉన్నారు. ఇటు ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్, శామ్ కరన్, జోఫ్రా ఆర్చర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వాంఖడే గడ్డపై అభిమానుల మద్దతు భారత్‌కు అదనపు బలంగా మారనుంది. ఈ నేపథ్యంలో సామ్ కరన్ అన్నట్లుగా ఇంగ్లాండ్ నిజంగానే ముంబై ప్రేక్షకులను 'సైలెంట్' చేస్తుందా లేక టీమిండియా తన పంజా విసురుతుందా అనేది చూడాలి.
పోరుకు సిద్ధమైన జట్లు:
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, మహమ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ ఉడ్.