ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీఫైనల్ చేరిందనే అక్కసో లేక పాకిస్థాన్ ఇంటి బాట పట్టిందనే బాధనో తెలియదు కానీ ఆ దేశ మాజీ క్రికెటర్లు అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. భారత్ సెమీఫైనల్ కూడా చేరదని, టైటిల్ గెలిచే దమ్ము లేదని పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ తన అక్కసు వెళ్లగక్కుతుంటే.. భారత ఆటగాళ్లకు ఎలాంటి డోప్ టెస్ట్‌లు ఉండవని అహ్మద్ షాజాద్ ఆరోపించాడు.
ఐసీసీ టోర్నీల సమయంలో ఆటగాళ్లకు డోప్ టెస్ట్‌ల నిర్వహిస్తారని, కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తమ ఆటగాళ్లను టెస్ట్ చేసేందుకు అనుమతించదని అహ్మద్ షాజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(డబ్ల్యూఏడీఏ) నిబంధనలకు అనుగుణంగా ఐసీసీ ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు చేస్తోంది. నిషేధిత పదార్థాలను గుర్తించడానికి ఆటగాళ్ల మూత్ర, రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు.
క్రికెట్ పారదర్శతను కాపాడటానికి టోర్నీలు, ఇతర సమయాల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నమూనాల్లో ఏవైనా నిషేధిత పదార్థాలు కనిపిస్తే.. సదరు ఆటగాళ్లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అయితే బీసీసీఐ తమ ఆటగాళ్లకు ఈ పరీక్షలు చేయకుండా ఐసీసీని అడ్డుకుంటుందని అహ్మద్ షేజాద్ ఆరోపించాడు. ఐసీసీ కంటే తమ వద్దే మెరుగైన టెక్నాలజీ ఉందని చెబుతుందని పేర్కొన్నాడు.

'బీసీసీఐ తమ ఆటగాళ్లను ఐసీసీ టోర్నీల సమయంలో డోప్ పరీక్షలు చేయడానికి అనుమతించదు. ఆటగాళ్లు డ్రగ్స్, నిషేధిత పదార్థాలను వాడుతున్నారో లేదో తనిఖీ చేయడానికి ఈ డోప్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఎప్పుడూ ఐసీసీ.. భారత ఆటగాళ్లకు డోప్ పరీక్షలు చేయాలని అడిగినా, బీసీసీఐ దానిని తిరస్కరిస్తుంది. తమ ఆటగాళ్లను పరీక్షించడానికి తమ వద్దే మెరుగైన సాంకేతికత ఉందని వారు చెబుతుంటారు.'అని హార్నా మనా హై టీవీ షోలో షాజాద్ చెప్పుకొచ్చాడు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను అహ్మద్ షాజాద్ చూపించలేకపోయాడు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ అమీర్.. ఇంగ్లండ్‌తో వాంఖడే వేదికగా జరిగే సెమీఫైనల్లో భారత్ ఓటమిపాలవుతుందని జోస్యం చెప్పాడు. భారత జట్టు ఒకరిద్దరిపై ఆధారపడి విజయాలు సాధించిందని, ఇంగ్లండ్ చేతిలో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డాడు. 'మంచి వికెట్‌పై భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రషీద్ భాయ్(పాక్ మాజీ క్రికెటర్) చెప్పినట్లు ఇంగ్లండ్ ఛేజింగ్ చేస్తే ఆ జట్టు విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది హై స్కోరింగ్ గేమ్. భారత జట్టు విషయానికి వస్తే ఒకరిద్దరూ మినహా మిగతా బ్యాటర్లు ఫామ్‌లో లేరు. ఈ టోర్నీలో భారత జట్టు బ్యాటింగ్‌ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. భారత జట్టు బ్యాటింగ్ విభాగం పూర్తిగా తడబడుతోంది.
ఇషాన్ కిషన్ పాకిస్థాన్‌పై మాత్రమే ఆడాడు. అభిషేక్ శర్మ ఫామ్‌లోనే లేడు. తిలక్ వర్మ ఇప్పటి వరకు ప్రభావం చూపించలేదు. సూర్యకుమార్ యాదవ్ సూపర్-8 దశ నుంచి తడబడుతున్నాడు. సంజూ రాణించగా.. బౌలింగ్‌లో బుమ్రా అదరగొడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పలేం. అందుకే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫేవరేట్ అని చెబుతున్నా.'అని అమీర్ చెప్పుకొచ్చాడు.