ఐసీసీ ర్యాంకులు: అగ్రస్థానంలో నిషేధ బౌలర్ కగిసో రబాడ

Posted By:
Banned Rabada returns to top of ICC rankings

హైదరాబాద్: మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో రబాడ పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 11 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

రెండో టెస్టులో రబాడ విజృంభించాడు. ఈ బౌలింగ్ ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకుల్లో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగో స్థానంకు చేరగా రవింద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు 900 రేటింగ్ పాయింట్ల మార్క్‌ని సైతం అందుకున్నాడు.

తద్వారా 902 రేటింగ్ పాయింట్లను అందుకున్న 23వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా నుంచి నాలుగో బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఫిలాండర్(2013లో 912 ), షాన్‌ పొలాక్‌( 1999లో 909), స్టెయిన్‌(2014లో 909) పాయింట్లతో తనకన్నా ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆండర్సన్ మళ్లీ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.

గురువారం నుంచి ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టెస్టుల్లో ఆండర్సన్ మంచి ప్రదర్శన చేస్తే తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటాడు.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే 943 పాయింట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 912 పాయింట్లతో రెండో ‍స్థానంలో ఉన్నాడు.

ఇటీవల అద్భుత సెంచరీతో మెరిసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ 5 స్థానాలు ఎగబాకి 778 పాయింట్లతో ఏడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జట్ల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. నెంబర్ వన్ స్థానంలో భారత్ ఉండగా, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా... మూడో స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది.

మరోవైపు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు రబాడ దూరమయ్యాడు. రెండో టెస్టులో రెండుసార్లు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రబాడపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. రెండో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ను ఔట్‌ చేసిన అనంతరం అతడి భుజానికి భుజం తాకిస్తూ వెళ్లినందుకు రిఫరీ రబాడ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు విధించాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో కూడా రబాడ హద్దులు దాటి ప్రవర్తించాడు.

వార్నర్ పట్ల దురుసుగా: రబాడ దూకుడుపై ఐసీసీ మరోసారి కొరడా

ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔటైన తర్వాత అతడని పెవిలియన్‌కు పంపే క్రమంలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు. దీంతో రబాడ ఖాతాలో మొత్తం ఎనిమిది డీమెరిట్ పాయింట్లు చేరాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు డీమెరిట్ పాయింట్లు ఏదైనా ఆటగాడి ఖాతాలో ఉంటే అతడిపై నిషేధం విధిస్తారు. దీంతో రబాడపై రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం పడింది.

Story first published: Tuesday, March 13, 2018, 17:11 [IST]
Other articles published on Mar 13, 2018
Read in English: Rabada tops of ICC rankings

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి