భారీ స్కోరును బెంబేలెత్తించిన బంగ్లాదేశ్

Posted By:
 Bangladesh bury Bengaluru demons in Colombo

హైదరాబాద్: అయిపోయింది. ఇక వీళ్ల కాదు అనుకున్న సమయంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు చెలరేగి ఆడి లంక ఇచ్చిన భారీ లక్ష్యాన్ని సైతం చేధించారు. విజయాన్ని అందుకున్నారు. శనివారం జరిగిన ఈ పోటీలో బంగ్లా బ్యాట్స్‌మెన్ మొండి పట్టుదలే జట్టుకు విజయాన్ని అందించింది. వారెవ్వా ముష్ఫికర్‌.. అనే స్థాయిలో శనివారం చెలరేగి ఆడుతూ.. బంతిని బౌండరీలకు బాదాడు. బంగ్లా ఆటంతా ఒక్కడే ఆడాడా అనే స్థాయిలో తన స్తైర్యాన్ని చూపించాడు.

ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ అద్భుతం చేసింది. అసాధ్యమనిపించే లక్ష్యాన్ని ఛేదించింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రహీమ్‌ 35 బంతుల్లో (72) నాటౌట్‌తో పాటు ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (47), లిటన్‌ దాస్‌ (43) చెలరేగడంతో 215 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులుండగా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

'కుశాల్‌' ధమాకా: అంతకుముందు ఫామ్‌లో ఉన్న కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌ల మెరుపులతో లంక భారీ స్కోరు చేయగలిగింది. గుణతిలక (26), మెండిస్‌ జోడీ తొలి వికెట్‌కు 4.3 ఓవర్లలోనే 56 పరుగులు జోడించింది. గుణతిలక తర్వాత వచ్చిన పెరీరాతో కలిసి మెండిస్‌ బంగ్లా బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. 13 ఓవర్లకే స్కోరు 135 పరుగులకు చేరుకుంది. తర్వాత రెండు ఓవర్ల వ్యవధిలో లంక 3 వికెట్లు కోల్పోయినా.. కుశాల్‌కు తోడైన తరంగ ధాటిగా ఆడటంతో ఇన్నింగ్స్‌ మళ్లీ వేగం పుంజుకుంది.

తమీమ్‌, లిటన్‌ చెలరేగి ఆడటంతో బంగ్లా ఆరంభం నుంచే లక్ష్యం దిశగా పరుగులు పెట్టింది. ముఖ్యంగా లిటన్‌ సిక్సర్ల మోత మోగించాడు. ఆరో ఓవర్లో లిటన్‌ ఔటయ్యే సమయానికే స్కోరు 74 పరుగులకు చేరింది. పది ఓవర్లకు స్కోరు 103/2. తమీమ్‌ ఔటైపోయాడు. రహీమ్‌ వచ్చేటప్పటికి విజయానికి 63 బంతుల్లో 115 పరుగులు చేయాలి. ఈ దశలో రహీమ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. సౌమ్య సర్కార్‌ (24), మహ్మదుల్లా (20)ల నుంచి అతడికి సహకారమందింది.

టీ20ల్లో బంగ్లాదేశ్‌కిదే అత్యధిక ఛేదన. మొదట బరిలోకి దిగిన కుశాల్‌ పెరీరా 48 బంతుల్లో (74), కుశాల్‌ మెండిస్‌ (57), తరంగ (32) మెరుపులు మెరిపించడంతో లంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. సోమవారం భారత్‌, శ్రీలంక తలపడతాయి.

Story first published: Sunday, March 11, 2018, 9:53 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి