కొన్ని రోజుల క్రితం టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందంటే.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ వ్యూయర్‌షిప్ రికార్డులు కూడా బద్దలైపోయాయి. మళ్లీ అవే జట్లు వన్డే సిరీస్‌లో తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం నాడు ఢాకాలోని షేర్-ఈ-బంగ్లా స్టేడియంలో జరుగుతుంది.
అయితే ఈ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు గట్టి షాక్ తగిలింది. వెన్ను నొప్పితో ఆ జట్టు స్టార్ పేసర్ తస్కిన్ అహ్మద్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతను లేకపోవడం టీమిండియా ఓపెనర్లు రోహిత్, ధవన్‌కు ఊరటనిస్తుందని వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అన్నాడు. బంగ్లా తరఫున అద్భుతంగా రాణిస్తున్న తస్కిన్ అహ్మద్.. కొత్త బంతితో చెలరేగుతున్నాడని, త్వరగా వికెట్లు తీసుకుంటున్నాడని డీకే గుర్తు చేశాడు.
టీ20 వరల్డ్ కప్‌లో కూడా తస్కిన్ అహ్మద్ అద్భుతంగా రాణించాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇదే విషయాన్ని చెప్పిన డీకే.. ముజీబుర్ రెహ్మాన్ ఉన్నప్పటికీ బంగ్లాకు తస్కిన్ అహ్మద్ చాలా కీలకమైన బౌలర్ అని చెప్పాడు. అలాగే గజ్జల్లో నొప్పి కారణంగా వన్డే సిరీస్‌కు ఆ జట్టు సారధి, స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ దూరం అవడంపై కూడా డీకే స్పందించాడు.
తమీమ్ ఇక్బాల్ లేకపోవడం కచ్చితంగా బంగ్లా జట్టుకు లోటేనని, అతను ఒక టెంపోలో బ్యాటింగ్ చేస్తాడని, అది వన్డే సిరీస్‌లో మిస్ అవుతామని అన్నాడు. తమీమ్ గైర్హాజరీలో మరో ఓపెనర్ లిటన్ దాస్ ఆ జట్టుకు సారధ్యం వహిస్తాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత బౌలింగ్‌ను లిటన్ దాస్ చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. ఈ లెక్కన బంగ్లా పర్యటన థ్రిల్లింగ్‌గా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.