క్రైస్ట్‌చర్చ్: తమను తిట్టే హక్కు అభిమానులకు ఉందని టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అన్నాడు. బాగి ఆడినప్పుడు ప్రశంసించినట్లే విఫలమైనప్పుడు విమర్శిస్తారని తెలిపాడు. ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. అసిఫ్ అలీ అందించిన సునాయస క్యాచ్‌ను వదిలేయడంతో టీమిండియా విజయవకాశాలు దెబ్బ తిన్నాయి. దాంతో సోషల్ మీడియా వేదికగా అర్ష్‌దీప్ సింగ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఖలిస్తానీ ఉగ్రవాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అతని వికీపీడియా పేజీలో 'అర్ష్‌దీప్ ఖలిస్థానీ నేషనల్ క్రికెట్‌కు ఆడటానికి ఎంపికయ్యాడు'అని మార్పులు చేశారు. ఈ విషయంపై ఘాటుగా స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక శాఖ.. వికీపీడియా సంబంధిత అధికారులను వివరణ కోరింది. ఈ విషయాన్ని తాజాగా అర్ష్‌దీప్ సింగ్ ముందు ఉంచగా.. తెలివిగా సమాధానమిచ్చాడు. 'క్రికెటర్లను, వారి ఆటను అభిమానులు ఎంతో ప్రేమిస్తారు. బాగా ఆడినప్పుడు ఎంత ఆనందపడతారో.. ఆడలేకపోయినప్పుడు సైతం అంతే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దేశం తరఫున ఆడుతున్నాం కాబట్టే మా విషయంలో వారు అంతలా భావోద్వేగానికి లోనవుతుంటారు. మాపై కోపగించుకునే హక్కు వారికుంది. క్రికెటర్‌గా ఆ రెండింటినీ మేం స్వీకరించాల్సివుంటుంది'అని తెలిపాడు.
ఈ విమర్శలతో మరింత రాటు దేలిన అర్ష్‌దీప్ సింగ్ టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ పెర్ఫామెన్స్‌తో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన అర్ష్‌దీప్ వన్డే క్రికెట్‌లోకి కూడా అరంగేట్రం చేశాడు. మూడో వన్డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన అర్ష్‌దీప్ సింగ్ ట్రోలింగ్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్‌తో పోటీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఉమ్రాన్‌తో తనకు పోటీ లేదని చెప్పాడు.
'ఉమ్రాన్ మాలిక్‌తో కలిసి బౌలింగ్ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ వాతావరణం సరదాగా ఉంది. సహచర బౌలర్‌గా ఉమ్రాన్ నుంచి నాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను, ఉమ్రాన్ వరుసగా ఓవర్లు వేయడం వల్ల బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్రాన్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తాడు. నేనేమో 130-135 కిలోమీటర్ల వేగంతో సంధిస్తా. పేస్‌లో మార్పు వల్ల ప్రత్యర్థి బ్యాటర్ అయోమయానికి గరవుతాడు. మేమిద్దరం దీర్ఘకాలం ఇలానే బౌలింగ్ భాగస్వామ్యం కొనసాగిస్తాం. టీ20లతో పోలిస్తే వన్డేల్లో బౌలింగ్ వేయడం కాస్త డిఫరెంట్.'అని అర్ష్‌దీప్ వెల్లడించాడు.