T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపైనే ఉంది. భారత్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్న ఈ ఫైనల్ మ్యాచ్ .. క్రికెట్ అభిమానులు ఓ గొప్ప విందు కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. టోర్నీ ఆరంభం నుంచి అభిషేక్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తండ్రి నమ్మకం.. క్లిష్ట సమయంలో అండగా..
ఈ కఠిన పరిస్థితుల్లో అభిషేక్ శర్మకు తన తండ్రి, కోచ్ రాజ్‌కుమార్ శర్మ నుంచి అండ లభించింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడిపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. "అభిషేక్ ఫైనల్లో ఖచ్చితంగా అద్భుతంగా ఆడుతాడు.. తన బ్యాటింగ్‌తో ఇండియాను కచ్చితంగా గెలిపిస్తాడు" అని ఆయన ధీమాగా చెప్పారు. ఓ తండ్రిగా తన బిడ్డకు ఇలాంటి కష్ట సమయంలో ఇచ్చే ప్రోత్సాహం, అభిషేక్‌లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, ఈ మాటలు అభిషేక్ శర్మ మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దుతాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

పవర్‌ప్లేలో కివీస్‌కు సవాల్
అభిషేక్ శర్మ తనదైన రోజున బౌలర్లకు చుక్కలు చూపించడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవర్‌ప్లే ఓవర్లలో అతను చెలరేగితే మ్యాచ్ గమనం పూర్తిగా మారుతుంది. కివీస్ బౌలర్లు పటిష్టంగా ఉన్నప్పటికీ.. అభిషేక్ తన విధ్వంసకర శైలిని ప్రదర్శిస్తే, భారత్‌కు తిరుగుండదని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో అతను తన అసలైన ఫామ్‌ను అందుకుంటే, టీమిండియా లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులభం అవుతుంది.
పాత రికార్డులే ఆశాకిరణం
ప్రస్తుతం అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్‌పై అతని గణాంకాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో కివీస్ బౌలర్లను అభిషేక్ ఉతికి ఆరేశాడు. మొదటి టీ20లో 84 పరుగులతో కదం తొక్కిన అభిషేక్ శర్మ.. మూడో మ్యాచ్‌లో 68 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ పాత జ్ఞాపకాలను, ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేసుకుంటూ.. అదే తరహా బ్యాటింగ్ ఫైనల్లో వస్తుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
అభిషేక్ శర్మ కెరీర్ ప్రస్థానం
అభిషేక్ శర్మ కేవలం ఒక టోర్నీతో అంచనా వేయదగ్గ ఆటగాడు కాదు. 2024లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 45 టీ20ల్లో 1386 పరుగులు చేసి, ఏకంగా 188.8 స్ట్రైక్ రేట్‌తో తానెంత ప్రమాదకర బ్యాటరో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా 77 మ్యాచ్‌ల్లో 1816 పరుగులు చేసి తన సత్తా చాటాడు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే రెండు అంతర్జాతీయ సెంచరీలు సాధించడం అతని ప్రతిభకు నిదర్శనం.
చరిత్ర దిశగా భారత్
మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్‌లో అభిషేక్ శర్మ తన తండ్రి నమ్మకాన్ని నిజం చేస్తాడా? తన బ్యాటింగ్‌తో భారత్ వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషిస్తాడా? అనేది వేచి చూడాలి. అభిషేక్ బ్యాట్ గనుక ఫైనల్లో గర్జిస్తే, అది టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.