ఇంగ్లాండ్‌కు దెబ్బ: లార్డ్స్‌లో భారత్‌తో జరిగే టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం

Posted By:
Affray trial: Ben Stokes to miss Lord's Test against India in August

హైదరాబాద్: ఆగస్టులో టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ దూరం కానున్నాడు. గతేడాది వెస్టిండిస్‌తో వన్డే సిరిస్ సందర్భంగా బ్రిస్టల్ నైట్ క్లబ్‌లో బెన్ స్టోక్స్ గొడవ పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన విచారణ బ్రిస్టల్ క్రౌన్ కోర్టులో ఆగస్టు 6 నుంచి మొదలుకానుంది.

ఈ విచారణ సుమారు ఐదు నుంచి ఏడు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. దీంతో బెన్ స్టోక్స్ ఆగస్టు 9 నుంచి లార్డ్స్ వేదికగా భారత్‌తో రెండో టెస్టుకు దూరం కావాల్సి వస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడానికి ముందు ఈ కేసులో తొలి విచారణ జరిగిన సమయంలో బెన్ స్టోక్స్ తన నేరాన్ని అంగీకరించిక పోవడం విశేషం.

బ్రిస్టల్ నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవలో బెన్ స్టోక్స్ ఓ వ్యక్తి ముఖంపై పిడిగుద్దులు కురిపించిన వీడియో వైరల్ కావడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అనంతరం విడుదల చేశారు. దీంతో అతడితో పాటు అక్కడే ఉన్న అలెక్స్ హేల్స్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

యాషెస్‌ సిరీస్‌లో ఆడే ఇంగ్లాండ్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈ సందర్భంగా స్టోక్స్ మాట్లాడుతూ నైట్ క్లబ్ వివాదంలో తన తప్పేమీ లేదని కోర్టు నుంచి క్లీన్‌గా బయటపడతానని చెప్పాడు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.

ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. సుదీర్ఘమైన ఈ సిరిస్ ఆగస్ట్ 1 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి టీ20తో మొదలుకానుంది. ఆగస్టు 9 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండటం... అదే సమయంలో స్టోక్స్ కోర్టు విచారణకు హాజరవుతుండటంతో రెండో టెస్టుకు అందుబాటులో లేకుండా పోతున్నాడు.

మరోవైపు బ్రిస్టల్ నైట్ క్లబ్‌లో బెన్ స్టోక్స్ గొడవ పడిన రేయాన్ హలే, రేయాన్ అలీలు కూడా ఈ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 12 (సోమవారం)న వీడియో లింక్ ద్వారా కోర్టు ముందు బెన్ స్టోక్స్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను నిరపరాధినని కోర్టుకు విన్నవించుకున్నాడు. స్టోక్స్‌పై నేరం రుజువైతే అక్కడి చట్టాల ప్రకారం కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Story first published: Monday, March 12, 2018, 18:13 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి