సారీ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులు: రాయితో దాడి ఘటనపై జంపా

Posted By:

హైదరాబాద్: గువహటి వేదికగా రెండో టీ20 ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్తోన్న సమయంలో ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని ఇప్పటికే పలువురు క్రికెటర్లు ఖండించారు. అయితే తాజాగా ఈ రాయి దాడిపై ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్పందించాడు.

రాయి దాడి ఘటన బాధ కలిగించింది

రాయి దాడి ఘటన బాధ కలిగించింది

'బస్సు ఎక్కగానే నేను హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటున్నాను. ఇంతలో పెద్దగా శబ్దం వచ్చింది. చూస్తే మా బస్సు అద్దం పగిలింది. భయం వేసింది. ఇంతలో మా భద్రతా సిబ్బంది బస్సుపై రాయితో దాడి జరిగిందని చెప్పారు. ఈ ఘటన కొంచెం బాధ కలిగించింది. గువహటిలో భారత్‌పై విజయం సాధించడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ మా బస్సుపై దాడికి పాల్పడ్డారు' అని జంపా తెలిపాడు.

ఎవరో ఒక వ్యక్తి వల్ల మిగతా అభిమానులు బాధపడుతున్నారు

'నిజానికి భారత అభిమానులకు మాపై చాలా ప్రేమ ఉంటుంది. క్రికెట్‌ అంటే వీరికి చాలా ఇష్టం. అందుకే మేము భారత్‌ వచ్చి ఆడేందుకు ఇష్టపడతాం. ఎవరో ఒక వ్యక్తి ఇలా దాడికి పాల్పడి ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాడు. అతడి వల్ల మిగతా అభిమానులు చాలా బాధపడుతున్నారు' అని జంపా పేర్కొన్నాడు.

అసలేం జరిగిందంటే?

గువహటి వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం హోటల్‌కు వెళ్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై ఎవరో రాయి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బస్సు అద్దం ధ్వంసమైంది. ఈ దాడికి సంబంధించిన ఫోటోను ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్‌ ట్విట్టర్‌లో అభిమానలతో పంచుకున్నాడు. 'హోటల్‌కు వెళ్తున్న దారిలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాయి విసరడం ఆందోళన కలిగించింది' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

సారీ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులు

సారీ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులు

ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై దాడి ఘటనను ఇప్పటికే పలువుర క్రికెటర్లు స్పందించారు. టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఖండించాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు. ఇలాంటి చర్యలతో దేశానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నాడు. మరోవైపు అభిమానులు సైతం ఈ దాడి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. గువహటి అభిమానులు సైతం బుధవారం పలు చోట్ల ‘సారీ ఆస్ట్రేలియా' అన్న ప్లకార్డులు ప్రదర్శించారు.

Story first published: Thursday, October 12, 2017, 12:52 [IST]
Other articles published on Oct 12, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి