న్యూజిల్యాండ్‌తో తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన సంజూ శాంసన్‌ను రెండో వన్డేలో కెప్టెన్ ధవన్ పక్కన పెట్టేశాడు. ఇదేంటయ్యా? అని అడిగితే.. మొదటి వన్డేలో ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడంతో ప్రాబ్లం అయిందని, అందుకే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ దీపక్ హుడాను తీసుకొని సంజూను పక్కన పెట్టామని చెప్పాడు. దీంతో జట్టులో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ల అవసరం మరోసారి తేటతెల్లమైంది. గతంలో టీమిండియాలో సచిన్, సెహ్వాగ్, గంగూలీ, యువరాజ్ సింగ్ తదితరులంతా బ్యాటుతోనే కాదు బంతితోనూ సత్తా చాటేవారు.
ఇప్పుడు మాత్రం బౌలింగ్ చేసే బ్యాటర్లే కరువయ్యారు. ప్రస్తుత టాపార్డర్ బ్యాటర్లలో రాహుల్ ఎప్పుడూ బౌలింగ్ చెయ్యలేదు. కోహ్లీ అడపా దడపా బౌలింగ్ చేస్తుంటాడు. రోహిత్ ఒకప్పుడు బౌలింగ్ కూడా చక్కగా చేసేవాడు. కానీ ఇటీవలి కాలంలో వీళ్లు కూడా బౌలింగ్ చేసింది లేదు. పూర్తిగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేసి బౌలింగ్‌ను వదిలేశారు. ఇదే విషయాన్ని మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఎత్తి చూపాడు.
భారత్ వద్ద ఆల్‌రౌండర్ల కొరతకు కారణం ఇదేననన్నాడు ఆకాష్ చోప్రా. గతంలో ఆటగాళ్లు కనీసం నెట్‌లో అయినా బౌలింగ్ చేసేవారని, దీంతో వాళ్ల బౌలింగ్ చెడిపోయేది కాదని చెప్పాడు. కానీ ఇప్పుడు భారత ఆటగాళ్లు నెట్‌లో కూడా బౌలింగ్ చెయ్యడం లేదన్నాడు. 'ఇప్పుడు ఎక్స్‌ట్రాగా నలుగురు నెట్ బౌలర్లను తీసుకెళ్తున్నారు. దానికితోడు త్రో డౌన్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ కూడా నెట్ బౌలర్లు, త్రో డౌన్ స్పెషలిస్టులను ఎదుర్కొంటున్నారు. అందుకే బౌలర్ల బ్యాటింగ్ మెరుగవుతోంది కానీ.. బ్యాటర్ల బౌలింగ్ మెరుగవడం లేదు' అని వివరించాడు.
ప్రస్తుతం బ్యాటర్లు అయితే బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని, ఆ తర్వాత ఇక వెళ్లిపోతున్నారని చోప్రా అన్నాడు. గతంలో అయితే బ్యాటర్లు కూడా బౌలింగ్ చేసేవాళ్లను గుర్తుచేశాడు. ప్రస్తుతం టీమిండియాకు కనిపిస్తున్న టాపార్డర్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా ఒక్కడే కావడం గమనార్హం. వెంకటేశ్ అయ్యర్ వంటి వారికి అవకాశం ఇచ్చినా, పెద్దగా రాణించకపోవడంతో మళ్లీ సెలెక్ట్ చేయడం లేదు. దీన్ని కూడా మాజీలు తప్పుబడుతున్నారు.