ఏం జరుగుతుందో!: తొలిసారి 200కుపైగా స్కోరు, ఐదో వన్డేపై ఆసక్తి

Posted By:
South Africa

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో గెలుపెవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది. పోర్ట్ ఎలిజబెత్‌లోని సెయింట్‌ జార్జెస్‌ పార్క్‌ స్టేడియంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తొలిసారి 200కుపైగా స్కోరు నమోదు చేయడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

భారత్‌-దక్షిణాఫ్రికా 5వ వన్డే లైవ్ స్కోరు కార్డు

ఈ వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సఫారీ గడ్డపై సిరీస్‌ గెలిచిన భారత తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అంతేకాదు వన్డేల్లో నెంబర్‌ వన్‌ ర్యాంకును కాపాడుకుంటుంది. అలా జరగని పక్షంలో సిరిస్ ఫలితం ఆరో వన్డేకు మారుతుంది. దీంతో చివరి వన్డేలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా సెయింట్‌ జార్జెస్‌ పార్క్‌లో అత్యధిక టార్గెట్‌ ఛేజింగ్‌లను ఒకసారి పరిశీలిద్దాం. 2002లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 327 పరుగుల లక్ష్యాన్ని ఇక్కడ ఛేదించింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2005లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి ఐదు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఆ తర్వాత 2015లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్‌ చేధించింది. తొమ్మిది బంతులుండగా వికెట్‌ తేడాతో వెస్టిండిస్ విజయం సాధించింది.

2016లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 263 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది. ఈ పరుగులే ఇప్పటివరకు ఈ స్టేడియంలో అత్యధిక టార్గెట్‌ ఛేజింగ్‌లు. ఇదిలా ఉంటే ఈ స్టేడియంలో 39 వన్డే మ్యాచ్‌లు జరగ్గా, అందులో ఛేజింగ్‌ జట్టు 19 సార్లు గెలవగా, మరో 19 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించింది.

ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే ఈ స్టేడియంలో భారత్‌ రికార్డు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. 1992 నుంచి ఇక్కడ జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ ఓటమి పాలైంది. అంతేకాదు ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా 200కు పైగా పరుగులు నమోదు చేయలేకపోయింది.

Rohit Sharma

ఈ మ్యాచ్‌కు ముందు వరకూ భారత జట్టు అత్యధిక స్కోరు కూడా 176 మాత్రమే. అయితే ఐదో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. దీంతో సఫారీ జట్టుకు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (115; 126 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీతో రాణించాడు.

ఈ సిరిస్‌లో తొలి నాలుగు వన్డేల్లో విఫలమైన రోహిత్ శర్మ ఐదో వన్డేలో మాత్రం చెలరేగాడు. ఇక, శిఖర్‌ ధావన్‌ (34), విరాట్‌ కోహ్లీ (26), శ్రేయీస్‌ అయ్యర్‌ (30) ఫరవాలేదనిపించారు. చివరి 10 ఓవర్లలో పరుగులు రాబట్టడంలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడ 4 వికెట్లు తీయగా, రబాడకు ఒక వికెట్ దక్కింది.

ఈ క్రమంలో ఎంగిడి (4/51) వన్డే కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలిసారి ఈ స్టేడియంలో రెండొందల పరుగుల మార్కును చేరిన భారత జట్టు విజయాన్ని అందుకుని సిరీస్‌ను సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే. మరోవైపు సఫారీలు ఇక్కడ 32 మ్యాచ్‌లు ఆడగా 11 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిపాలయ్యారు.

Story first published: Tuesday, February 13, 2018, 21:59 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి