
కేఎల్ రాహుల్
టెస్టుల్లో కేఎల్ రాహుల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టులో చోటుని సుస్థిరం చేసుకున్నాడు. అయితే, గత కొన్నాళ్లుగా టెస్టు తుది జట్టులో చోటు కూడా దక్కించుకోలేని పరిస్థితి కేఎల్ రాహుల్‌ది. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన తొలి టీ20లో సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్ మళ్లీ ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో సెంచరీ సాధించాడు. మిగతా సిరిస్ మొత్తం పేలవ ప్రదర్శన కనబర్చాడు. గత ఐదేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడీ అద్భుతంగా రాణిస్తోంది. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా ఆడే అవకాశం రావడం లేదు. అయితే, టెస్టుల్లో మాత్రం అప్పుడప్పుడు ఓపెనర్‌గా కనిపిస్తున్నాడు. అందుకు కారణంగా రోహిత్ శర్మకు టెస్టుల్లో చోటు దక్కకపోవడమే. అయితే, విండిస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సెలక్టర్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించారు. తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌తో మరో ఓపెనర్‌గా పృథ్వీషా బరిలోకి దిగనున్నాడు. ఈ సిరిస్‌లో పృథ్వీషా రాణించి రాహుల్ విఫలమైతే అతడి ఓపెనింగ్ కెరీర్ ఇక ముగిసినట్లే.

మయాంక్ అగర్వాల్
దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియా-ఏ మ్యాచ్‌ల్లో నిలకడగా ఆడుతోన్న అటగాళ్లలో ముందుగా వినిపిస్తోన్న పేరు మయాంక్ అగర్వాల్. రంజీ ట్రోఫీలో వెయ్యికిపైగా పరుగులు, విజయ్ హాజార్ ట్రోఫీలో 700కుపైగా పరుగులు చేశాడు. వెస్టిండిస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ప్రకటించిన 15 మంది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, రాజ్‌కోట్ వేదికగా జరిగే తొలి టెస్టు కోసం జట్టు మేనేజ్‌మెంట్ ఎంపిక చేసిన 12 మంది సభ్యుల్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. తొలి టెస్టులో రాహుల్ విఫలమైతే, హైదరాబాద్ వేదికగా జరిగే రెండో టెస్టులో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అజ్యింకె రహానే
ప్రస్తుతం టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల ముగిసి ఇంగ్లాండ్ పర్యటన రహానే కెరీర్‌లో ఓ పీడకలగా మారింది. మొత్తం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే 25.70 యావరేజితో 257 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టులో చోటు దక్కించుకోవడం కోసం రహానే నానాతంటాలు పడుతున్నాడు. వెస్టిండిస్‌తో జరగనున్న సిరిస్‌లో రహానే గనుక విఫలమైతే టెస్టు జట్టులో కూడా చోటు దక్కించుకోవడం కష్టం.

రిషబ్ పంత్
టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న వృద్ధిమాన్ సాహా గాయపడటం యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కలిసొచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్ సిక్సు బాది పరుగుల ఖాతాను ప్రారంభించాడు. దీంతో రిషబ్ పంత్‌ని అభిమానులు ముద్దుగా భారత ఆడమ్ గిల్‌క్రిస్ట్‌గా పిలుచుకుంటున్నారు. ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాట్స్ మెన్ కావడమే ఇందుకు కారణం. అయితే, వికెట్ కీపర్‌గా పంత్‌కి ఇంకాస్త అనుభవం ఉండాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. తన తొలి మూడు టెస్టుల్లో 76కుపైగా బైస్ ఇవ్వడమే ఇందుకు కారణం. ఉపఖండం పిచ్‌లపై మ్యాచ్‌లో నాలుగు లేదా ఐదో ఆటలో స్పిన్నర్ల బౌలింగ్‌లో వికెట్ల వెనుక పంత్ జాగ్రత్తగా వ్యవహారించాల్సి ఉంది.

ఉమేశ్ యాదవ్
జస్ప్రీత్ బుమ్రాకి విశ్రాంతి ఇవ్వడంతో ఆతడి స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు ఫార్మాట్లలో కూడా జట్టుకు బ్యాకప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లకు భారత జట్టు తరుపున ప్రీమియం ఫాస్ట్ బౌలర్లుగా కొనసాగుతున్న భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాల వర్క్ లోడ్‌ని దృష్టిలో పెట్టుకుని వెస్టిండిస్‌తో సిరిస్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో ఉమేశ్ యాదవ్ తనను తాను నిరూపించుకోవడానికి ఈ సిరిస్ అతడికి ఓ గొప్ప అవకాశం. అంతేకాదు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా సిరిస్‌కు అతడు ఎంపికవడంలో ఈ సిరిస్ ప్రదర్శన కీలకం కానుంది.