కామన్వెల్త్: స్వర్ణం గెలిచిన మేరీకోమ్, శనివారం 3 స్వర్ణాలు, 2 రజతాలు

Posted By:
CWG 2018: Boxers Mary Kom, Gaurav Solanki grab gold

హైదరాబాద్: గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన పోటీల్లో వరుసగా పతకాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, 2 రజతాలు చేరాయి. భారత బాక్సింగ్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్‌ మరోసారి సత్తా చాటింది.

శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఉత్తర ఐర్లండ్‌కు చెందిన క్రిస్టినా ఓహరను పదునైన పంచ్‌లతో చిత్తుచేసి భారత్‌కు స్వర్ణం అందించింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు బాక్సింగ్‌లో తొలి స్వర్ణ పతకాన్ని అందించిన మహిళగా మేరీకోమ్ అరుదైన ఘనత సాధించింది.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన మేరీకోమ్

తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ఆమె కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిచింది. మహిళల 48 కేజీల విభాగంలో ఫైనల్లో మేరీకోమ్‌.. నార్తర్న్‌ ఐర్లాండ్‌కు చెందిన క్రిస్టినీ ఓహారాపై విజయం సాధించి భారత్‌కు స్వర్ణ పతకం అందించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో మేరీకోమ్‌ పాల్గొనడం ఇదే తొలిసారి.పాల్గొన్న తొలిసారే స్వర్ణం కొల్లగొట్టడం విశేషం.

స్వర్ణాన్ని నా ముగ్గురు కుమారులకు అంకితమిస్తున్నాను

తాను పాల్గొన్న తొలి కామన్వెల్త్‌ గేమ్స్‌లోనే బంగారు పతకం సాధించడం పట్ల మేరీకోమ్‌ సంతోషం వ్యక్తం చేశారు. స్వర్ణం సాధించిన అనంతరం మేరీకోమ్‌ ట్విటర్‌ ద్వారా ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్‌ గేమ్స్‌లో నేను గెలిచిన ఈ బంగారు పతకాన్ని నా ముగ్గురు కుమారులకు అంకితమిస్తున్నాను. నాకు ఫోన్‌ చేసినప్పుడల్లా వారు ఇంటికి ఎప్పుడొస్తావు అని అడిగేవారు. నా కోచ్‌లకు, సపోర్టింగ్‌ స్టాఫ్‌, శాయ్‌కు నా ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

పురుషుల 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకీకి స్వర్ణం

మరో బాక్సర్ గౌరవ్‌ సోలంకీ కూడా సత్తా చాటాడు. పురుషుల 52 కిలోల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గాడు. పురుషుల 52 కిలోల కేటగిరీలో బాక్సర్ గౌరవ్ సోలంకీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రింగ్‌లో దూకుడుగా ఆడిన గౌరవ్ తన ఖాతాలో గోల్డ్ మెడల్‌ను వేసుకున్నాడు. 21 ఏళ్ల గౌరవ్ ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన ప్రత్యర్థి బ్రెండన్ ఇర్విన్‌ను 4-1 తేడాతో ఓడించాడు.

కామెన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టిన సంజీవ్ రాజ్‌పుత్

ఇక షూటింగ్‌లోనూ భారత్ జోరు కొనసాగింది. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ తన ఖాతాలో గోల్డ్ మెడల్ వేసుకున్నాడు. పురుషుల 50మీ రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్‌లో సంజీవ్ కామెన్‌వెల్త్ గేమ్స్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

49కేజీల విభాగంలో రజతం సాధించిన అమిత్

పురుషుల బాక్సింగ్ 60 కేజీలో విభాగంలో కౌశిక్ కూడా మరో రజతం నెగ్గాడు. 60 కేజీల కేటగిరీలో అతను స్వల్ప తేడాతో బౌట్‌ను కోల్పోయాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ హ్యారీ గార్‌సైడ్ చేతిలో ఓడిపోయాడు. పురుషుల బాక్సింగ్ 49 కిలోలో విభాగంలో అమిత్‌ రజతం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో 20 స్వర్ణాలు, 13 రజతాలు, 14 కాంస్యాలు చేరాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌ 20 స్వర్ణపతకాలు సాధించి.. 47 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది.

Story first published: Saturday, April 14, 2018, 10:59 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి