హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు తనకు మధ్య ఎలాంటి పోటీ లేదంటోంది ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న సింధు ఈ మేరకు మీడియాతో మాట్లాడింది. వ్యక్తిగత విషయాలను మీడియాతో చర్చించిన పీవి సింధు తన తల్లిదండ్రుల గురించి ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడింది.
మీడియా ప్రతినిధి క్రీడల్లో రాణించేందుకు తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించారని అడిగిన ప్రశ్నకు 'క్రీడాకారులు నా తల్లిదండ్రులుగా ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. ఏ ఆట ఆడాలనుకుంటే నన్ను ఆ వైపుగా ప్రోత్సహించారు.' ప్రత్యేకంగా బ్యాడ్మింటనే ఎందుకు ఎంచుకున్నారు. మీ పేరెంట్స్‌లా వాలీబాల్‌ను కెరీర్‌గా ఎందుకు ఎంచుకోలేదని అడిగితే..
ఇదే ప్రశ్న ఇప్పటికీ నన్నెంతో మంది అడిగారు. కానీ, నాకు బ్యాడ్మింటన్ అంటే ఆసక్తి అనగానే నా తల్లిదండ్రులు అటు వైపు పంపారు. వారి త్యాగానికి, కష్టానికి నేను న్యాయం చేయాలి' అని ఎప్పుడూ కష్టపడుతుంటాను. ఒలింపిక్స్ 2020లో స్వర్ణం గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటూ బదులిచ్చారు.
సైనాతో పోటీ గురించి మాట్లాడుతూ... 'సైనాకు నాకూ మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉంది. అంతేతప్ప వ్యక్తిగతంగా తనతో ఎప్పుడూ పోటీకి దిగను. మేమిద్దరం దేశం కోసం ఆడుతున్నప్పుడు పోటీ ఉండాల్సిన అవసర్లేదు. విదేశాల్లో ఆడుతున్నప్పుడు దేశ ప్రతిష్ఠను నిలపాల్సిన బాధ్యత ఇద్దరిపై సమానంగా ఉంది. అక్కడ వేరువేరుగా ఉండకూడదు. కానీ, ఆటలో భాగంగా కేవలం మా ఇద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మాత్రమే పోటీ ఉంటుంది. కోర్టు నుంచి బయటకి వచ్చాక మేం తిరిగి స్నేహితుల్లానే ఉంటాం' అని తెలిపింది.