హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను దక్కించుకున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ తొలిసారిగా పలు విభాగాల్లో క్రీడాకారులకు అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల్లో బెస్ట్ కోచ్ అవార్డును పుల్లెల గోపీచంద్ కైవసం చేసుకున్నారు.
మొత్తం 11 విభాగాలకు గాను ఈ అవార్డులను ఈఎస్‌పీఎన్ ప్రకటించింది. గత ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు నెగ్గిన కిదాంబి శ్రీకాంత్‌కు పురుషుల విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేశారు. మహిళల విభాగంలో పీవీ సింధుకు ఈ అవార్డు దక్కింది.
ఇక కోచ్ విషయానికి వస్తే పుల్లెల గోపీచంద్ బెస్ట్ కోచ్ అవార్డును సొంతం చేసుకున్నారు. అభినవ్ బింద్రా, సోమ్‌దేవ్, బైచుంగ్ భూటియా, జగ్బీర్ సింగ్, రోహిత్ బ్రిజ్‌నాథ్, వెంకటేశన్ దేవరాజన్, నిషా మిల్లట్, అపర్ణ పొపట్, జగదీశ్, మనీషా, అంజుబాబీ జార్జ్‌తో కూడిన జ్యూరీ బృందం ఈ విజేతలను ప్రకటించడం విశేషం.
ఇక, ఆసియా కప్ గెలిచిన మహిళల హాకీ జట్టును 'టీం ఆఫ్ ద ఇయర్'గా ప్రకటించారు. గతేడాది భారత్ వేదికగా అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ తరఫున ఏకైక గోల్‌ను జీక్సన్ సింగ్ సాధించాడు. ఆన్‌లైన్ పోల్‌లో దీనికే ఎక్కువ మంది ఓటు వేయడంతో 'మూమెంట్ ఆఫ్ ద ఇయర్'గా ఇది నిలిచింది.
Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి. Subscribe to Telugu MyKhel.