రసవత్తరంగా కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్ ఫైనల్స్: స్వర్ణం కోసం సైనా Vs సింధు

Posted By:
CWG 2018: Badminton: Its Sindhu vs Saina in womens final; Srikanth to take on Lee in mens final

హైదరాబాద్: గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ ఫైనల్స్ భారత అభిమానులక కనువిందు చేయనున్నాయి. ఎందుకంటే మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు.

దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. ఈ ఇద్దరిలో ఎవరికి ఏ పతకం దక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఫైనల్ పోటీలు ఆదివారం జరగుతాయి కాబట్టి.

స్వర్ణం కోసం సైనా Vs సింధు

సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులపై అద్భుత విజయాన్ని సాధించి ఫైనల్‌కు అర్హత సాధించారు. సెమీస్‌లో 68 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా 21-14, 18-21, 21-17 తేడాతో స్కాట్లాండ్‌ క్రీడాకారిణి క్రిస్టీ గిల్‌మెర్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో సెమీస్‌లో పీవీ సింధు 21-18, 21-8 తేడాతో కెనడా డిఫెడింగ్ ఛాంపియన్ మిచెల్లీ లీపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.

సింధు, సైనాకు కోచ్ ఒక్కరే

ఈ మ్యాచ్‌తో ఓ చిక్కు వచ్చి పడింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు కోచ్ ఒక్కరే కావడం విశేషం. ఆయనే కోచ్‌ పుల్లెల గోపీచంద్‌. ఆదివారం జరిగే మహిళల సింగిల్స్‌ ఫైనల్లో గోపీచంద్‌ ఎవరిని గెలిపిస్తాడో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌, భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు.

పురుషుల ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్‌

పురుషుల సెమీస్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-10, 21-17 తేడాతో ఇంగ్లాండ్‌ క్రీడాకారుడు రాజీవ్ ఓస్పేపై విజయం సాధించాడు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తన జోరు కొనసాగించాడు. మరో పురుషుల సెమీస్‌లో భారత్‌కు చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 16-21, 21-9, 14-21 తేడాతో చాంగ్‌ వీ లీ (మలేసియా)పై ఓడిపోయాడు. దీంతో ఫైనల్లో స్వర్ణం కోసం శ్రీకాంత్ మలేసియాకు చెందిన చాంగ్‌ వీ లీతో తలపడనున్నాడు.

కామన్వెల్త్ క్రీడల్లో ఇదే తొలిసారి

ఇక, పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్‌ రంకిరెడ్డి-చిరాక్‌ శెట్టి జోడీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఈ జోడీ శ్రీలంకపై 21-18, 21-10తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ క్రీడలో పురుషుల డబుల్స్‌ జట్టు ఫైనల్స్‌ చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Story first published: Saturday, April 14, 2018, 12:57 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి