హైదరాబాద్: ఆసియా గేమ్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో మొట్టమొదటి సారి రజతం గెలిచిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆసియా గేమ్స్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో ఓటమిపాలై సింధు రజత పతకానికే పరిమితమైంది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో వరుస గేమ్స్‌లో ఓడినప్పటికీ చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధు అరుదైన ఘనత సాధించింది. ఫైనల్స్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
ఆట ప్రారంభం నుంచీ సింధు వెనుకంజలోనే ఉంది. తొలి గేమ్ 0-5తో వెనుకంజలో ఉన్న సింధు ఆ తర్వాత కాస్త పోరాడింది. కోర్టులో అత్యంత వేగంగా కదిలే తైజు కదలికలను సింధు అర్థం చేసుకోలేకపోయింది. డ్రాప్ షాట్లు, స్మాష్లు ఆడుతూ సింధును ఒత్తిడికి గురి చేసిన తైజు తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించింది.
ప్రత్యర్థి పదే పదే ఔట్ కొట్టడంతో వచ్చిన పాయింట్లు తప్ప సింధు సాధించిన పాయింట్లు తక్కువే అని చెప్పాలి. దీంతో సింధు 13-21తో తొలి సెట్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లోనూ మొదటి నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అక్కడక్కడా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడినా.. ప్రత్యర్థిపై పూర్తిగా పైచేయి సాధించకపోయింది.
13 సార్లు తలపడగా 10సార్లు తైజుదే పైచేయి
దీంతో రెండో గేమ్‌ను సింధు 16-21తో ఓడిపోయి మ్యాచ్‌ను చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 13 సార్లు తలపడగా 10సార్లు తైజుదే పైచేయి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సింధు ఓడినా ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.
1982 తర్వాత సింగిల్స్‌లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి
1982 తర్వాత సింగిల్స్‌లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు సైనా నెహ్వాల్ సెమీస్‌లోనే ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన సింధుపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా చాలామంది ప్రముఖులు ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పీవీ సింధు మోస్ట్ టాలెంటెడ్
"పీవీ సింధు మోస్ట్ టాలెంటెడ్, స్ఫూర్తిదాయకమైన భారత అథ్లెట్. ఆమె స్కిల్స్, పట్టుదల వెల కట్టలేనివి. ఏషియాడ్‌లో రజతం గెలిచిన పీవీ సింధు, 125 కోట్ల భారతీయులు గర్వించేలా చేసింది" అంటూ ప్రధాని మోడీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది
"పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్‌లో మొట్టమొదటి సిల్వర్ సాధించింది. చరిత్రలో నిలిచేపోయే మ్యాచ్ ఆడింది" అంటూ కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు.
Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి.
Allow Notifications
You have already subscribed