రష్యా, బెలారస్ టెన్నిస్ ప్లేయర్లను వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనకుండా నిషేధం విధించడాన్ని టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదెల్ ఖండించాడు. ఈ నిషేధం 'అన్యాయం' అని రాఫెల్ నాదల్ ఆదివారం స్పెయిన్లోని మాడ్రిడ్‌లో విలేకరులతో తెలిపాడు. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ఎంచుకుందని అభిప్రాయపడ్డాడు. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ATP(అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్), WTA(వుమెన్స్ టెన్నిస్ అసోసియేష్)తో పాటు టెన్నిస్ స్టార్ ప్లేయర్లు అయిన నాదల్, నోవాక్ జకోవిచ్ లాంటి ఆటగాళ్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు.
బెలారస్ దేశం రష్యా మిత్రదేశంగా ఉంది. బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి రష్యన్ దళాలను అనుమతించడంతో ఈ రెండు దేశాల ప్లేయర్లపై ఆల్ ఇంగ్లాండ్ క్లబ్.. వింబుల్డన్ టోర్నీలో ఆడేది లేదంటూ నిషేధం విధించింది. తద్వారా పురుషుల ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన డేనియల్ మెద్వెదేవ్, అలాగే గతేడాది వుమెన్స్ సెమీ-ఫైనలిస్ట్ అయిన బెలారస్‌కు చెందిన అరీనా సబాలెంకా సహా ప్రతిభావంతులైన ఆటగాళ్లు వింబుల్డన్ టోర్నీకి దూరం కానున్నారు. తాజాగా నాదల్ స్పందిస్తూ.. యుద్ధం విషయంలో వారి తప్పేం లేదన్నాడు. ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కానీ నిర్ణయం తీసుకునేవారి చేతిలోనే అంతా ఉందన్నాడు. ఒక తోటి ఆటగాడిగా తాను ఏమి చెప్పలేకపోతున్నానని, రష్యన్, బెలారస్ ప్లేయర్ల నిషేధం పట్ల చింతిస్తున్నానని పేర్కొన్నాడు.
టెన్నిస్‌లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి చాలా పేరుంది. ఈ టోర్నీని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ AELTC నిర్వహిస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా.. AELTC ఇటీవల ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తమకు సాధ్యమైన రీతిలో రష్యా ప్రభావాన్ని పరిమితం చేయడానికి రష్యన్, బెలారస్ ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అన్యాయమైన సైనిక దురాక్రమణ పరిస్థితులలో రష్యన్ లేదా బెలారసియన్ ఆటగాళ్ల వల్ల ఆయా దేశాలకు మంచి పేరు రావడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. వింబుల్డన్ టోర్నీ ఈ ఏడాది జూన్ 27నుండి జూలై 10వరకు జరగనుంది.