ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసా రద్దు చేయడంతో ప్రపంచ నంబర్ 1 నోవాక్ జోకోవిచ్ నేడు ఉదయం దబాయ్ చేరుకున్నాడు. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నుంచి బయలు దేరిన జోకోవిచ్ సోమవారం ఉదయానికి దుబాయ్‌లో అడుగు పెట్టాడు. నిబంధనల ప్రకారం దుబాయ్‌లో ఉండాలంటే ఎటువంటి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాత్రం కరోనా నెగెటివ్‌గా వచ్చి ఉండాలి.
కాగా గత నెలలో యూఏఈ వేదికగా జరిగిన టెన్నిస్ టోర్నీలోనే జోకోవిచ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 2020లో జరిగిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ టోర్నమెంట్‌ను జోకోవిచ్ గెలుచుకున్నాడు. అయితే ఈ ఏడాది ఆ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి జరగనుంది. దీంతో ప్రస్తుతం దుబాయ్ నంచి ఎక్కడికి వెళ్లాలనే దానిపై జోకోవిచ్‌కు స్పష్టతగా లేనట్టుగా తెలుస్తోంది.
జనవరి 6వ తేదీన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడడానికి మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టిన నోవాక్ జోకోవిచ్‌ను అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేసుకోకపోవడానికి జోకోవిచ్ చెప్పిన కారణాలు సరిగ్గా లేవని అతని వీసాను కూడా రద్దు చేశారు. దీంతో కోర్టులో న్యాయ పోరాటం చేసిన జోకోవిచ్ తన వీసాను పునరుద్దరింప చేసుకున్నాడు.
కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం జోకోవిచ్‌ను వదిలి పెట్టలేదు. ఈ సారి సరైనా ఆధారాలతో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి జోకోవిచ్ వీసాను రెండో సారి రద్దు చేశారు. ఈ సారి కోర్టులో కూడా జోకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. దీంతో చేసేదేమి లేక జోకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనకుండానే తిరుగు ముఖం పట్టాడు. అంతే కాకుండా ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం మరో మూడేళ్లు జోకోవిచ్ ఆ దేశంలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడే అవకాశం కోల్పోవడంతో 21వ గ్రాండ్‌స్లామ్ గెలిచి టెన్నిస్‌లో చరిత్ర సృష్టించాలనుకున్న జోకోవిచ్ ఆశలకు బ్రేక్ పడింది. దీంతో ఆ రికార్డు సృష్టించడానికి జోకోవిచ్ మరింత సమయం వేచి చూడక తప్పదు.
కాగా ఇప్పటివరకు తన కెరీర్‌లో 20 గ్రాండ్ స్టామ్‌లు నెగ్గిన ఈ సెర్బియా స్టార్.. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌తో కలిసి సమంగా ఉన్నాడు. గాయం కారణంగా ఈ టోర్నీకి ఇప్పటికే రోజర్ ఫెదరర్ దూరమవగా తాజాగా జోకోవిచ్ కూడా దూరమయ్యాడు. దీంతో స్టార్ ప్లేయర్లలో రఫెల్ నాదల్ మాత్రమే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పాల్గొంటున్నాడు.