న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండేళ్లు వేటు: భగ్గుమన్న షరపోవా, అందమూ ఆటా...

By Pratap

లండన్‌: డోపింగ్‌ టెస్ట్‌లో చిక్కిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) రెండేళ్ల నిషేధం విధించింది. షరపోవా డోపింగ్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్టు స్వతంత్ర ట్రిబ్యునల్‌ తేల్చిందని ఐటీఎఫ్‌ బుధవారం ప్రకటించింది.

ఈ ఏడాది జనవరి 26 నుంచి ఆమెపై నిషేధం అమలవుతున్నట్లు తెలిపింది. ఐదు గ్రాండ్‌స్లామ్స్‌ టైటిళ్ల విజేత షరపోవా ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో వివాదాస్పద నిషేధిత ఉత్ప్రేకరం (మెల్డోనియం) వాడినట్టు తేలింది.

లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో తాను ఉత్ప్రేకరం వాడినట్లు షరపోవానే స్వయంగా అంగీకరించింది. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆమెపై ఐటీఎఫ్‌ తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో రష్యా రియో ఒలింపిక్స్‌ జట్టులో కూడా స్థానం కోల్పోయింది.

తనపై రెండేళ్ల నిషేధం విధించడం అన్యాయమని, ఐటీఎఫ్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానిస్తూ 29 ఏళ్ల షరపోవా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టింది. ట్రిబ్యునల్‌ సభ్యులను ఐటీఎఫ్‌ ఎంపిక చేసిందని, తాను మాత్రం ఉద్దేశ పూర్వకంగా ఏ తప్పూ చేయలేదని తెలిపింది. నిషేధంపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో సవాల్‌ చేస్తానని, టెన్నిస్ క్రీడను కోల్పోతున్నందుకు ఎంతో బాధగా ఉందని చెప్పింది.

Maria Sharapova banned for two years for doping

అభిమానుల లేఖలు చదువుతున్నానని, సామాజిక సైట్లలోనూ వారి పోస్ట్‌లు చూస్తున్నానని, త్వరలోనే మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్‌ ఆడతానని ఆశిస్తున్నానని ఆమె అన్నది. లాత్వియాలో తయారవుతున్న మెల్డోనియం డ్రగ్‌ను గుండెకు సంబంధించిన సమస్యలకు ఉపయోగిస్తారని, ఈ డ్రగ్‌ తీసుకుంటే రక్తప్రసరణ వేగం పెరుగుతుందని, కండరాలకు ఎక్కువ ఆక్సిజన్‌ సరఫరా అందుతుందని చెప్పింది. దీంతో క్రీడాకారులు తమ ఫిట్‌నెస్‌ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు దీన్ని వాడుతున్నారని చెప్పింది.

షరపోవా అద్భుత ఆటకు అందం తోడై ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. షరపోవా ఎక్కువ సంఖ్యలో గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గకపోయినా సౌందర్య రాశి కావడంతో కార్పొరేట్‌ సంస్థలు తమ ఉత్పత్తులకు ఆమెను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు బారులు తీరాయి.. దీంతో గత 11 ఏళ్లుగా అత్యధిక ఆర్జన గల క్రీడాకారిణుల జాబితాలో షరపోవానే అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది.ఈ ఏడాదే ఆమెను సెరెనా విలియమ్స్‌ అధిగమించింది.

రష్యాలో పుట్టిన షరపోవా టెన్నిస్ శిక్షణ కోసం అమెరికాలో స్థిరపడింది. షరపోవా 14 ఏళ్లకే టెన్నిస్ క్రీడలో (2001) ఫ్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించింది. రెండేళ్లకే ఆమె టాప్‌-50లో స్థానం పొందింది. 2004 వింబుల్డన్‌ ఫైనల్లో అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ను ఓడించి టైటిల్‌ నెగ్గడడంతో షరపోవా అప్పటికప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. 18 ఏళ్ల వయసులో 2005లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

దాంతో ఈ ఫీట్‌ సాధించిన తొలి రష్యా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 2006లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. అలాగే 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. అయితే తర్వాత ఫామ్‌ కోల్పోయి నాలుగేళ్లు మరో టైటిల్‌ నెగ్గలేదు. ఇక 2012లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచి కెరీర్‌ స్లామ్‌ పూర్తి చేసింది. 2014లోనూ ఆమె రొలాండ్‌ గ్రాంసీ ట్రోఫీ సొంతం చేసుకుంది.

షరపోవా 1987లో రష్యాలోని సైబీరియాలో జన్మించింది. ఏడేళ్ల షరపోవాకు అమెరికాలో టెన్నిస్‌ శిక్షణ ఇప్పించడం కోసం ఆమె తండ్రి యూరి 700 డాలర్లు అప్పు చేశాడు. ఒక్కముక్క ఇంగ్లిష్‌ రాకుండానే షరపోవా ఏడేళ్ల వయసులో అమెరికాలో కాలు పెట్టింది. వీసా సమస్య తలెత్తడంతో ఆమె తల్లి రెండేళ్ల పాటు కూతురుకు దూరంగా రష్యాలోనే ఉండిపోయింది.

కూతురి కలనెరవేర్చేందుకు యూరి అంట్లు తోమాడు కూడా. ఇక తొమ్మిదేళ్ల షరపోవాలోని అద్భుత ప్రతిభను ఐఎమ్‌జీ గ్రూప్‌ గుర్తించింది. ఆ సంస్థ 35 వేల డాలర్ల ఆర్థిక సాయం చేయడంతో ఫ్లోరిడాలోని బొలెటెరి టెన్నిస్‌ అకాడమీలో షరపోవాకు సీటు లభించింది. ఇదే ఆమె జీవితాన్ని మార్చింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X