'ఆ టెన్నిస్ స్టార్ మోసగత్తె, ఆమెను టెన్నిస్‌ ఆడనివ్వొద్దు'

Posted By:

హైదరాబాద్: డోపింగ్ నిషేధం ముగిసిన తర్వాత తిరిగి బుధవారం కోర్టులోకి అడుగుపెట్టిన రష్యా టెన్నిస్‌ స్టార్ మారియా షరపోవా తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో ఆమె విజయం సాధించింది. రాబెర్టా విన్సీని 7-5, 6-3 తేడాతో చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్‌ గంటా 45 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగింది. మొద‌ట సెట్‌లో తొలి స‌ర్వీస్ గేమ్‌ను కోల్పోయింది. కానీ ఆ త‌ర్వాత పుంజుకున్న ష‌ర‌పోవా తొలి సెట్‌ను 7-5 తేడాతో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనే సర్వీస్‌ కోల్పోయిన షరపోవా.. తర్వాతి గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించింది.

ఆ త‌ర్వాత రెండ‌వ సెట్‌లో ప్ర‌త్య‌ర్థిని ఈజీగా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ష‌ర‌పోవా మొత్తం 11 ఏస్‌లు సంధించింది. మ్యాచ్ అనంతరం ఆమెకు వీక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ఘనమైన స్వాగతం పలికారు. అయితే షరపోవా పునరాగమనంపై కెనడా క్రీడాకారిణి యూజిని బౌచర్డ్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 'Cheater' Maria Sharapova should be banned for life: Eugenie Bouchard

షరపోవా మోసగత్తె అని ఆమెకు జీవితకాల నిషేధమే సరైనదని వ్యాఖ్యానించింది. అంతేకాదు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన ఆమెను మళ్లీ ఆడేందుకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది. 'ఇది సరికాదు. ఆమె ఒక మోసగత్తె. ఏ క్రీడలో అయిన మోసగాళ్లను మళ్లీ ఆడనివ్వకూడదు. ఇలా ఆడనివ్వడం ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేయడమే. ప్రపంచ టెన్నిస్‌ సమాఖ్య ఈ విషయంలో తప్పుడు సంకేతాలు ఇస్తోంది' అని బౌచర్డ్‌ అభిప్రాయపడింది.

'మోసం చేసిన వాళ్లను కూడా తిరిగి ఘనంగా ఆహ్వానిస్తారనే తప్పుడు సంకేతాలు ఈ చర్చ వల్ల పిల్లలకు వెళ్లే అవకాశముంది. షరపోవాకు జీవితకాల నిషేధమే సరైన శిక్ష' అని బౌచర్డ్ అభిప్రాయపడింది. షరపోవా పునరాగమనంపై పలువురు టెన్నిస్‌ స్టార్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Friday, April 28, 2017, 10:58 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి