లియాండర్ పేస్ మళ్లీ ఆ స్థానానికి వచ్చేశాడు

Posted By:
AITA names Leander Paes in Davis Cup squad, asks players to ‘put differences aside’

హైదరాబాద్: లియాండర్ పేస్ ఒకప్పటి వైభవాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ తిరిగి డేవిస్‌కప్‌ జట్టులోకి వచ్చాడు. రోహన్‌ బోపన్న అభ్యంతరాలను పక్కకుపెట్టి అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) చైనాతో పోరుకు పేస్‌కు జట్టులో స్థానం కల్పించింది. దీంతో సెలక్షన్‌ వ్యవహారాల్లో ఆటగాళ్ల జోక్యాన్ని సహించేంది లేదని గట్టిగా సందేశం పంపినట్లయింది.

డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌-50లో చోటు సంపాదించడంతో పేస్‌కు మార్గం సుగమమైంది. ఐదుగురు సభ్యుల సెలక్షన్‌ కమిటీ.. పేస్‌తో పాటు యుకి బాంబ్రి, రామ్‌కుమార్‌ రామనాథన్‌, సుమిత్‌ నగాల్‌, రోహన్ బోపన్నలను ఎంపిక చేసింది. దివిజ్‌ శరణ్‌ రిజర్వ్‌ సభ్యుడిగా ఉంటాడు. కెనడాతో ప్రపంచ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ పోరులో పేలవ ప్రదర్శన చేసిన పూరవ్‌ రాజాపై ఊహించినట్లుగానే వేటు పడింది. చైనాతో ఆసియా/ఓషియానా జోన్‌ గ్రూప్‌-1 రెండో రౌండ్‌ పోరు (ఏప్రిల్‌ 6- 7 )తియాంజిన్‌ (చైనా)లో జరుగుతుంది.

 ఇష్టం లేదని బోపన్న చెప్పకనే..:

ఇష్టం లేదని బోపన్న చెప్పకనే..:

పేస్‌ తన డేవిస్‌కప్‌ ప్రపంచ రికార్డు సాధించేందుకు వీలుగా రోహన్‌ బోపన్న చైనాతో పోరు నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడని పేర్కొంటూ నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌కు లేఖ రాసినట్లు ఏఐటీఏ వర్గాలు తెలిపాయి. అంటే పేస్‌తో జోడీగా ఆడడం తనకు ఇష్టం లేదని బోపన్న చెప్పకనే చెప్పాడన్నమాట. ఐతే సెలక్షన్‌ కమిటీ మాత్రం పేస్‌, బోపన్నలను ఇద్దరినీ ఎంపిక చేసింది. బంతిని బోపన్న కోర్టులోకి నెట్టింది. ఇక ఆడాలో లేదో తేల్చుకోవాల్సింది అతడే.

 బోపన్న ఇంకా మరిచిపోలేదని:

బోపన్న ఇంకా మరిచిపోలేదని:

‘‘పేస్‌తో విభేదాలను బోపన్న ఇంకా మరిచిపోలేదని, ఈ ఇద్దరి మధ్య కోర్టులో ఇప్పటికీ సమన్వయం లేదని నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి ఏఐటీఏతో చెప్పాడు. తనతో ఆడేలా బోపన్నను పేస్‌ మాత్రమే ఒప్పించగలడనన్నది అతడి భావన'' అని ఓ ఏఐటీఏ అధికారి చెప్పాడు.

ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుకుంటూ:

ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుకుంటూ:

‘బోపన్న ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుకుంటున్నాడు. ఒకవేళ అతడు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, దేశం తరఫున ఆడలేనంటే..ఏఐటీఏ అతడికి మద్దతివ్వదు. ఏడాదిలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే వాళ్లు దేశం తరఫున ఆడాల్సివుంటుంది. ఎలాంటి అజెండా లేకుండా ఓ రెండు వారాలు ఆడలేరా?' అని ఆ అధికారి అన్నాడు.

 ఒక ఆటగాడిగా గౌరవిస్తా:

ఒక ఆటగాడిగా గౌరవిస్తా:

‘‘తిరిగి భారత డేవిస్‌కప్‌ జట్టులో చోటు దక్కినందుకు సంతోషంగా ఉంది. నేను ఎంతో శ్రమించి ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యా. బోపన్నతో కలిసి ఆడాలనుకుంటున్నా. మాది మంచి జోడీ అవుతుంది. రోహన్‌ ఎంతో ప్రతిభావంతుడు. ఒక ఆటగాడిగా అతణ్ని గౌరవిస్తా'' అని 44 ఏళ్ల పేస్‌ అన్నాడు.

పేస్‌, బోపన్నలే అత్యుత్తమ డబుల్స్‌ జోడీ:

పేస్‌, బోపన్నలే అత్యుత్తమ డబుల్స్‌ జోడీ:

బోపన్న చాలా కాలంగా పేస్‌తో ఆడేందుకు తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. పేస్‌ మాత్రం బోపన్నతో ఆడేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని అంటున్నాడు. పేస్‌ గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్థాన్‌తో పోరుకు జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో లియాండర్‌ పేస్‌, రోహన్‌ బోపన్నలే అత్యుత్తమ డబుల్స్‌ జోడీ అని భారత డేవిస్‌కప్‌ కోచ్‌ జీషన్‌ అలీ అన్నాడు.

Story first published: Monday, March 12, 2018, 11:18 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి