న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్ర సృష్టించిన తంగవేలు: పారాలింపిక్స్‌లో స్వర్ణం, రూ.2కోట్ల నజరానా

రియో డీజనీరో: రియో ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కోసం ఎదురుచూసిన కోట్లాదిమంది భారతీయులు చివరికి పీవీ సింధు ద్వారా ఓ రజతం, సాక్షి మాలిక్ ద్వారా ఓ కాంస్యం రావడంతో అమితానందపడ్డారు. అయితే, స్వర్ణ పతకం మాత్రం కలగానే మిగిలిపోయింది. పారాలింపిక్స్‌లో మాత్రం మనకు నిరీక్షించాల్సిన అవసరమే లేకుండా పోయింది మనందరికి. ఎందుకంటే అంచనాల్లేకుండా బరిలోకి దిగిన 21ఏళ్ల మారియప్పన్‌ తంగవేలు హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు.

అంతేగాక, పారాలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం సాధించిన భారత తొలి ఆటగాడిగా మారియప్పన్‌ రికార్డుల్లోకెక్కాడు. శనివారం ఫైనల్లో 1.89 మీటర్లు ఎత్తు ఎగిరిన తంగవేలు అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన వరుణ్‌ భాటి 1.86 మీటర్లతో ఒక దశలో రెండో స్థానంలో నిలిచాడు. అయితే అంతే ఎత్తు ఎగిరిన సామ్‌ గ్రీవ్‌ (అమెరికా)కు రజతం దక్కింది. వరుణ్‌ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకే విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించడం ఇదే తొలిసారి.

Rio Paralympics 2016: India's Mariyappan

శుక్రవారం జరిగిన హైజంప్‌ టీ42 విభాగం ఫైనల్లో ముగ్గురు భారతీయులు పోటీపడ్డారు. ముగ్గురూ తమ శక్తిమేర అసాధారణ ప్రతిభ చూపారు. అయితే, ఇద్దరికి పతకాలు లభించగా, శరత్‌ కుమార్‌ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆరంభంలో అందరికంటే ముందున్నా.. 1.77 మీటర్లు ఎత్తు మాత్రమే ఎగిరిన శరత్‌ ఆరో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

12 మంది పోటీపడిన ఈ విభాగంలో తొలి ఎనిమిది ప్రయత్నాల్లో ఆరుగురు 1.74 మీటర్ల అడ్డంకిని అధిగమించడం విశేషం. పదో ప్రయత్నంలో తంగవేలు 1.77 మీటర్ల మార్క్‌ అందుకున్నాడు. అప్పటికి లూకాజ్‌ మమ్‌జార్జ్‌ (పోలెండ్‌), జికియాంగ్‌ జింగ్‌ (చైనా), శరత్‌కుమార్‌లు మాత్రమే అతడితో పోటీలో ఉన్నారు. ఆ తర్వాత శరత్‌ వెనకబడిపోగా.. వరుణ్‌ పతక రేసులోకి వచ్చాడు. ఆఖరికి తంగవేలు, సామ్‌, వరుణ్‌ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది.

వరుణ్‌ తొలుత 1.83 మీటర్లు ఎగిరాడు. తంగవేలు అతడిని అనుసరించాడు. ఇక స్వర్ణం, రజతం భారత్‌కు ఖాయమనుకుంటున్న దశలో అమెరికా అథ్లెట్‌ 1.86 మీటర్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత మారియప్పన్‌, వరుణ్‌ కూడా ఆ మార్క్‌ను అందుకోగలిగారు. చివరికి తంగవేలు 1.89 మీటర్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.

రూ.2కోట్ల నజరానా ప్రకటించిన సీఎం జయలలిత

పారాలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం గెలిచిన తంగవేలు మారియప్పన్‌కు.. అతడి సొంతరాష్ట్రం తమిళనాడు రూ.2 కోట్ల నజరానా ప్రకటించింది. అతడి విజయాన్ని ప్రశంసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఓ లేఖ విడుదల చేశారు. 'ఒలింపిక్‌ విజేతల స్థాయిలో తంగవేలుకు కూడా నజరానా ఇవ్వాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. అతడి విజయం దేశానికి, రాష్ట్రానికి గర్వకారణం' అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

కాగా, కేంద్ర క్రీడల శాఖ కూడా స్వర్ణ విజేతలకు రూ.75లక్షలు ఇవ్వనుంది. 1968 నుంచి పారాలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతకాలు 10. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలున్నాయి. 1972లో మురళీకాంత్‌ స్విమ్మింగ్‌ (50 మీటర్ల ఫ్రీస్టయిల్‌3)లో తొలి పసిడి గెలిచాడు. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో దేవేంద్ర జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం గెలిచాడు. ఇప్పుడు తంగవేలు పసిడి గెలిచిన మూడో పారాఅథ్లెట్‌గా రికార్డు సాధించాడు. 2012 పారాలింపిక్స్‌లో హైజంప్‌ ఎఫ్‌42 విభాగంలో గిరీష్‌ నాగరాజెగౌడ రజతం నెగ్గాడు.

ఇది ఇలా ఉండగా, తంగవేలుపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
'భారత్‌ ఎంతో ఆనందంగా ఉంది. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మారియప్పన్‌కు.. కాంస్యం అందుకున్న వరుణ్‌ సింగ్‌కు అభినందనలు' అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 'తంగవేలు, వరుణ్‌ల విజయాలు చూసి దేశం గర్విస్తోంది. వారి భవిష్యత్తు మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నా' అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు.

'మారియప్పన్‌, వరుణ్‌లకు శుభాకాంక్షలు. మీ ప్రతిభ, స్ఫూర్తి ప్రశంసనీయం' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీర్తించారు. 'స్వర్ణ విజేతల క్లబ్‌లో మారియప్పన్‌ అడుగుపెట్టాడు. సుస్వాగతం. వరుణ్‌కు మద్దతుగా నిలిచిన గోస్పోర్ట్స్‌వాయిసెస్‌ సంస్థకు నా అభినందనలు' అని అభినవ్‌ బింద్రా వ్యాఖ్యానించారు.

'భారత్‌కు పారాలింపిక్స్‌ సంతోషం పంచింది. హైజంప్‌లో తంగవేలు, వరుణ్‌ పతకాలు సాధించారు. కమాన్‌ ఇండియా!' అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఉత్సాహపర్చారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ 'భారత క్రీడారంగంలో స్ఫూర్తిదాతలకు కొదవ లేదు. పారాలింపిక్స్‌లో పతకాలు అందుకున్న మరియప్పన్‌, వరుణ్‌లకు శుభాకాంక్షలు' అని తెలిపింది. వీరితోపాటు అనేకమంది సోషల్ మీడియాలో మారియప్పన్ పై ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు.

చేజారిన పతకాలు

పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో భారత అథ్లెట్‌ సందీప్‌ కొద్దిలో పతకం చేజార్చుకున్నాడు. పురుషుల ఎఫ్‌44 ఫైనల్లో అతడు 54.99 మీ. దూరం జావెలిన్‌ను విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. స్టెవార్ట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో - 57.32మీ.), అలిస్టర్‌ (కెనడా - 55.56మీ.), రోరి (న్యూజిలాండ్‌ - 54.99మీ.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి పతకాలు అందుకున్నారు.

మహిళల వ్యక్తిగత ఓపెన్‌ రికర్వ్‌ ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో పూజ 29వ స్థానంలో నిలిచింది. మిక్స్‌డ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో నరేశ్‌ ఆఖరి నుంచి రెండో స్థానంతో పోటీ నుంచి నిష్క్రమించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X