న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'నా కెరీర్‌లో అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఇదొకటి'

పీవీ సింధు.... భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణంగా మారింది. గతేడాది ఇదే సమయంలో రియో ఒలింపిక్స్‌లో రజతం గెలవడంతో దేశ వ్యాప్తంగా ఆమె పేరు మార్మోగుతోంది.

By Nageshwara Rao

హైదరాబాద్: పీవీ సింధు.... భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణంగా మారింది. గతేడాది ఇదే సమయంలో రియో ఒలింపిక్స్‌లో రజతం గెలవడంతో దేశ వ్యాప్తంగా ఆమె పేరు మార్మోగుతోంది. ఏడాది తర్వాత ఇప్పుడు కూడా సింధు పేరుని యావత్ దేశం స్మరించుకుంటోంది. గ్లాస్కో వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్లో ఆమె ప్రదర్శన అభిమానుల మనసు దోచింది.

ఆదివారం హోరాహోరీగా సాగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో వరల్డ్‌ చాంపియన్‌ అయ్యే సువర్ణావకాశాన్ని పీవీ సింధు త్రుటిలో చేజార్చుకుంది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన ఒకుహరా చేతిలో ఓటమి పాలై రజతాన్ని సొంతం చేసుకుంది. అయితే తన ప్రదర్శన, తాను సాధించిన పతకం విషయంలో గర్విస్తున్నానని చెప్పింది.

చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌ ఆడినందుకు గర్వపడుతున్నానని ఆమె తెలిపింది. తన కెరీర్‌లో అత్యుత్తమ మ్యాచ్‌లలో ఇదొకటని, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో దీటుగా తిరిగొస్తానని చెప్పింది. గతంలో రెండు సార్లు కాంస్యం నెగ్గి.. ఈ సారి పతకం రంగు మారుస్తానన్న మాటను నిలబెట్టుకున్నందకు సంతోషంగా ఉందని వెల్లడించింది.

స్వదేశానికి పయనమైన సింధు ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం తన కెరీర్‌పై మాట్లాడింది:

స్వర్ణం గెలవకపోవడం నిరాశ కలిగించినా

స్వర్ణం గెలవకపోవడం నిరాశ కలిగించినా

స్వర్ణం నెగ్గే సువర్ణావకాశాన్ని వదులుకున్నందుకు కొంత నిరాశ కలిగించింది. అయినా.. ముందుగా చెప్పినట్టు పతకం రంగు మార్చినందుకు సంతోషంగా ఉంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఒకుహరాకు, నాకు సమాన అవకాశం కనిపించింది. మొదటి సెట్‌ నుంచే ప్రతీ పాయింట్‌ ఇద్దరికీ ఎంతో కీలకమైంది. నేను ఆధిక్యంలో ఉన్నా.. ఒకుహరా ముందంజలో ఉన్నా.. ఆటలో ఎవరిదీ పైచేయి అనలేం. ఎన్నో సుదీర్ఘ ర్యాలీలు నడిచాయి. చివరి గేమ్‌లో 20-20తో స్కోర్లు సమమైనా మ్యాచ్‌ గెలిచేందుకు నా శాయశక్తులా పోరాడాను.

మరింతగా ఎదురుదాడి చేయాల్సింది

మరింతగా ఎదురుదాడి చేయాల్సింది

ఈ మ్యాచ్ నా సత్తాకు పరీక్ష పెట్టింది. ఇలాంటి మ్యాచ్‌ల్లో చాలా వేగంగా, తరచుగా వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. మేమిద్దరం ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. నేను మరింతగా ఎదురుదాడి చేయాల్సింది అంటున్నారు. కానీ, నేనైతే దూకుడుగానే ఆడా. అన్ని రకాలుగా ప్రయత్నించా. ఇలాంటి మ్యాచ్‌లు నెగ్గడం అంత ఈజీ కాదు. మన ఓపికతో పాటు ఆటలో ప్రతీ అంశాన్ని పరీక్షిస్తాయి. ఏదేమైనా చరిత్రలో నిలిచే ఫైనల్లో ఆడినందుకు నేను గర్వపడుతున్నా. ఒకుహరా సాదాసీదా క్రీడాకారిణి కాదు. ఆమెతో ఎప్పుడు పోటీ పడినా ఇలానే హోరాహోరీ పోరు ఉంటుంది. ఎక్కువగా ర్యాలీలతో నడిచిన ఈ మ్యాచ్‌ కఠినంగా అనిపించింది. మూడో గేమ్‌లో ఏ ఒక్క చాన్స్‌నూ వదలకూడదని అనుకున్నా. 11వ పాయింట్‌ తర్వాత ఆట సుదీర్ఘంగా సాగుతుందని ఊహించా. 13-12, 13-13, 14-13, 14-14 సాగడం బట్టి మేం ఎలా పోరాడామో చెప్పొచ్చు.

ఫిట్‌నెస్‌ విషయానికి వస్తే జపాన్‌ ప్లేయర్లు బలంగా ఉంటారు

ఫిట్‌నెస్‌ విషయానికి వస్తే జపాన్‌ ప్లేయర్లు బలంగా ఉంటారు

ఫైనల్‌ మ్యాచ్‌లో శారీరకంగా, మానసికంగా మా ఇద్దరకీ కఠిన పరీక్ష ఎదురైంది. ఫిట్‌నెస్‌ విషయానికి వస్తే జపాన్‌ ప్లేయర్లు ఎప్పుడూ శారీరకంగా బలంగా ఉంటారు. నొజోమి లాంగ్‌ ర్యాలీలు, స్లో డ్రాప్స్‌తో పరీక్షిస్తుందని తెలిసి అందుకు పూర్తిగా సన్నద్ధమై ఫైనల్‌కు వచ్చా. చివరి గేమ్‌లో 1-5తో వెనుకబడ్డా మళ్లీ పుంజుకోవడంతో గెలుస్తానన్న నమ్మకం ఏర్పడింది. అయితే, 11 పాయింట్ల తర్వాత ఆట నొజోమి చేతుల్లోకి వెళ్లిందనుకున్నా. అక్కడి నుంచి అంత భారీ ర్యాలీలు ఆడాల్సింది కాదు.

ర్యాలీలు సుదీర్ఘంగా

ర్యాలీలు సుదీర్ఘంగా

రెండో గేమ్‌లో 21-20 దగ్గర ఉన్నప్పుడు 22వ పాయింటు కోసం 73 షాట్ల ర్యాలీ ఆడాం. నేనైతే ఫలానా ర్యాలీని పెద్దదని అనుకోవడం లేదు. ప్రతీ ర్యాలీ సుదీర్ఘంగా సాగింది. అదొక్కటే కాదు.. మ్యాచ్‌లో చాలా ర్యాలీలు సుదీర్ఘంగా సాగాయి. కోర్టులో ఎక్కడ ఉన్నా షటిల్‌ను కిందపడనివ్వకూడదన్న పట్టుదలతో ఆడాను. అసాధ్యమనిపించినా షటిల్‌ను అందుకోవడం మానలేదు. ఎలాగైనా సరే పాయింటు సాధించాలన్నదే ఆ సమయంలో మా ఇద్దరి లక్ష్యం. అందుకు తగ్గట్లే ఆడటంతో ర్యాలీలు సుదీర్ఘంగా నడిచాయి. మొత్తంగా అదో అద్భుతమైన మ్యాచ్‌. అది నారోజు కాదంతే.

అది గొప్ప అనుభూతి

అది గొప్ప అనుభూతి

భారత్‌కు రెండు పతకాలు దక్కడంపై గర్వించదగ్గ విషయం. సైనా కూడా అద్భుతంగా ఆడింది. మేమిద్దరం (సైనా, సింధు) పోడియంపై నిల్చోవడం గొప్ప అనుభూతి. దేశానికి రజత పతకం అందించినందుకు నాకు గర్వంగా ఉంది. ఈ పతకం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లు సాధిస్తా. ఈ రెండు పతకాలు యువ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతాయని అనుకుంటున్నా. మొత్తంగా మా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నాం. దేశానికి రెండు పతకాలు నెగ్గడం గొప్ప విషయం.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X