కామన్వెల్త్: భారత షూటింగ్‌లో నేటి స్వర్ణాలు, టీనేజర్ అనీశ్ బన్వాలా సంచలనం, తేజస్వినీకి మరో స్వర్ణం

Posted By:
CWG 2018: Tejaswini Sawant grabs gold for India in 50M Rifle Three Positions

హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో భారత షూటర్లు మేటిగా రాణిస్తున్నారు. గురువారం మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో రజతం గెలుపొందిన తేజస్వినీ సావంత్ శుక్రవారం మాత్రం స్వర్ణం ఒడిసిపట్టింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో మొత్తం 457.9 పాయింట్లతో తేజస్వినీ సావంత్ బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా, మన దేశానికే చెందిన అంజుమ్ మౌద్గిల్ 455.7 పాయింట్లతో రజత పతకం, స్కాంట్లాండ్ షూటర్ సియోనిడ్ మెకింతోష్ 444.6 పాయింట్లతో కాంస్యం గెలుపొందారు.

టీనేజర్ సంచలనం:

25మీటర్ల షూటింగ్ పురుషుల విభాగంలో భారత ఆటగాడు అనీశ్ భన్వాలాకు స్వర్ణం దక్కింది. పదిహేనేళ్ల ఈ టీనేజర్ 30 పాయింట్లు సాధించి కొత్త రికార్డులను సైతం నెలకొల్పాడు.

చివరి రౌండ్లలో మౌద్గిల్ గురి తప్పి:

అంతకు ముందు 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్‌ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 582-31 పాయింట్ల సాధించిన తేజస్వినీ, మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ రౌండులో 589-32 రికార్డు పాయింట్లతో అంజుమ్ మౌద్గిల్ తొలి స్థానంలో నిలవడం విశేషం. దీంతో తుదివరకు తేజస్వినీ, మౌద్గిల్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడినా, చివరి రౌండ్లలో మౌద్గిల్ గురి తప్పింది.

మెరుగైన పాయింట్లు సాధించింది తేజస్విని:

తన అనుభవాన్నంతా ప్రదర్శించి మెరుగైన పాయింట్లు సాధించింది తేజస్విని. తద్వారా స్వర్ణం ఆమె వశమైంది. ఈ స్వర్ణంతో తేజస్వినీ సావంత్ మొత్తం కామన్వెల్త్ పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2006 కామన్వెల్త్‌లో రెండు స్వర్ణాలు, 2010 కామన్వెల్త్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం గెలుపొందిన తేజస్వినీ, 2018 కామన్వెల్త్‌లో ఇప్పటి వరకు ఓ స్వర్ణం, రజతం గెలుచుకుంది.

2010లో బంగారు పతకం గెలిచిన తేజస్విని:

వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2010లో బంగారు పతకం గెలిచిన తేజస్వినీ, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే రియో ఒలింపిక్స్‌లో మాత్రం ఆమెకు నిరాశ ఎదురైంది. రజతంతో సరిపెట్టుకున్న అంజుమ్ మౌద్గిల్ మార్చిలో జరిగిన ఇంటర్నేషన్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ పతకం గెలిచింది. ఈ పోటీల్లో రజత సాధించిన మౌద్గిల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ పతకం కావడం విశేషం.

Story first published: Friday, April 13, 2018, 10:21 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి