భారత్ ఖాతాలో 12వ స్వర్ణం: డబుల్ ట్రాప్‌లో గురి తప్పని శ్రేయాసి

Posted By:
CWG 2018: Shreyasi Singh brings gold for India in double trap

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌ ఆరంభంలో భారత వెయిట్‌ లిఫ్టర్లు మొదట మనకు పతకాలు అందిస్తే ఆ తర్వాత ఆ బాధ్యతను షూటర్లు తీసుకున్నారు.

కామన్వెల్త్ గేమ్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజాగా ఏడో రోజు షూటింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. మహిళల షూటింగ్‌ డబుల్‌ ట్రాప్‌లో శ్రేయాసి సింగ్ ఈ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో లోకల్ ఫేవరెట్ ఎమ్మా కాక్స్‌పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది. మరో భారత క్రీడాకారిణి వర్ష వర్మన్‌ ఒక్క పాయింట్‌ తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది.

2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ గెలిచిన శ్రేయాసి సింగ్.. ఈసారి ఫైనల్లో 96+2 స్కోరుతో స్వర్ణాన్ని దక్కించుకుంది. మూడు రౌండ్ల తర్వాత శ్రేయాసి రెండోస్థానంలో, మరో ఇండియన్ షూటర్ వర్ష మూడోస్థానంలో ఉన్నారు. చివరికి శ్రేయ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. వర్ష మాత్రం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది.

దీంతో రజతం గెలుచుకునే అవకాశాన్ని వర్ష వర్మన్‌ తృటిలో చేజార్చుకుంది. ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌ క్రీడాకారిణీలు రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. స్వర్ణం గెలిచిన అనంతరం శ్రేయాసి సింగ్ మాట్లాడుతూ 'స్వర్ణం పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. గత కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం దక్కింది. అప్పుడు స్వర్ణం రానందుకు చాలా బాధపడ్డా. తదుపరి కామన్వెల్త్‌లో ఎలాగైన స్వర్ణం సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నా' అని తెలిపింది.

ఇదిలా ఉంటే పురుషుల డబుల్‌ ట్రాప్‌లో భారత్‌కు చెందిన అంకుర్‌ మిట్టల్‌కు కాంస్యం అందించాడు. బుధవారం ఇప్పటి వరకు భారత్‌ సాధించిన మూడు పతకాలు షూటర్లు సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 24 పతకాలతో మూడోస్థానంలో కొనసాగుతోంది.

Story first published: Wednesday, April 11, 2018, 13:03 [IST]
Other articles published on Apr 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి