కామన్వెల్త్ గేమ్స్: ఆరంభ వేడుకలకు ముందే అథ్లెట్‌పై దాడి

Posted By:
Commonwealth Games hit by indecent assault case

హైదరాబాద్: బుధవారం కామన్వెల్త్ గేమ్స్‌కు తెరలేవనుంది. అయితే ఆరంభ వేడుకలకు ముందే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో దాడి కేసు నమోదైంది. గోల్డ్ కోస్ట్‌లోని క్రీడాగ్రామంలో తన పట్ల టీమ్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేశారని మారిషస్‌ అథ్లెట్‌ ఒకరు ఆరోపించారు.

తనను అసభ్యకర రీతిలో తాకుతూ దాడి చేశారని మారిషస్‌ చెఫ్‌ డి మిషన్‌ కయాసీ టీరోవెంగడమ్‌‌పై అథ్లెట్‌ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఆరంభ వేడుకలకు ముందే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని క్వీన్స్‌లాండ్‌ డీసీపీ స్టీవ్‌ గోలెచ్‌స్కీ తెలిపారు. 'ఈ ఘటనలో క్రిమినల్ విచారణ జరుపుతున్నాం. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో క్రీడాగ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం' అని అన్నారు.

మరోవైపు అథ్లెట్‌పై దాడికి పాల్పడిన ఘటనపై స్పందించిన గేమ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ గ్రీమ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు 6600 మంది క్రీడాకారులు గోల్డ్‌కోస్ట్‌కు చేరుకున్నారు. వీరంతా క్రీడాగ్రామంలో బస చేస్తున్నారు. వారి రక్షణ పట్ల బాధ్యతగా ఉంటామని, ఇలాంటి దాడులను తాము సహించబోం' అని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనపై మారిషస్‌ టీమ్‌ స్పందించించేందుకు నిరాకరించింది. కాగా దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చెఫ్‌ని బాధ్యతల నుంచి తప్పించినట్లు మారిషస్‌ మీడియాలో ఓ కథనం వచ్చింది. మారిషస్ నుంచి సుమారు 50పైగా అథ్లెట్లు ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్నారు.

18 క్రీడాంశాల్లో 6,600 మందికి పైగా అథ్లెట్లు:
గోల్డ్ కోస్ట్ వేదికగా మరికొన్ని గంటల్లో కామన్వెల్త్ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 18 క్రీడాంశాల్లో 71 దేశాలకు చెందిన 6,600 మందికి పైగా అథ్లెట్లు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు క్రీడాగ్రామానికి చేరుకున్నారు. అయితే అక్కడ అథ్లెట్లకు వసతులు కొరవడినట్లు తెలుస్తోంది.

దీంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోల్డ్‌కోస్ట్‌లో స్థానిక పరిస్థితులను అర్ధం చేసుకునేందుకు అథ్లెట్లు కొద్ది రోజుల ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఆటగాళ్లకు అన్ని వసతులు, సదుపాయాలను నిర్వహకులు కల్పిస్తున్నారు. అయితే, కొన్ని చొట్ల వసతులు లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో షార్ట్‌పుట్‌, డిస్కస్‌ విభాగాల్లో పోటీ పడే ఆటగాళ్లు కొబ్బరి కాయలతో ప్రాక్టీస్‌ చేస్తున్నారంటే.. అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 'మేము షార్ట్‌పుట్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు గుండులు అందుబాటులో లేవు. అందుకే కొబ్బరి కాయలతో సాధన చేస్తున్నాను. అలాగే డిస్కస్‌ కూడా. కొంచెం కష్టంగానే ఉంది' అని టపోకి అనే క్రీడాకారిణి తెలిపింది.

Story first published: Wednesday, April 4, 2018, 15:20 [IST]
Other articles published on Apr 4, 2018
Read in English: CWG hit by assault case

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి