కామన్వెల్త్ గేమ్స్: ఆరు స్వర్ణాలతో ఇంగ్లాండ్, రెండు ప్రపంచ రికార్డులు

Posted By:
Commonwealth Games: England win six golds on day one of Gold Coast 2018

హైదరాబాద్: గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు తొలిరోజు అద్భుత ప్రదర్శన చేశారు. 23 ఏళ్ల మిరాబాయి చాను అద్భుత ప్రదర్శనతో, రికార్డులను బద్దలు కొడుతూ మహిళల 48కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. స్నాచ్‌లో గరిష్టంగా 86 కిలోలు ఎత్తిన ఆమె.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 110 కిలోలు ఎత్తింది.

మొత్తంగా 196 కిలోలతో కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 175 కిలోలతో నైజీరియాకు చెందిన ఆగస్టినా న్వయకోలో స్థాపించిన రికార్డును బద్దలు కొట్టింది. ఇక, పురుషుల 56కేజీల విభాగంలో 249 (111కేజీ+138కేజీ) కర్ణాటకకు చెందిన గురురాజా రజతం గెలిచి భారత్‌కు తొలి పతకం అందించాడు.

ఇలా, తొలిరోజు భారత్‌కు రెండు పతకాలు లభించాయి. మరోవైపు తొలిరోజు ఇంగ్లాండ్ ఏకంగా ఆరు స్వర్ణాలు గెలుచుకుని పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మాక్స్‌ విట్‌లాక్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌‌లో ఇంగ్లాండ్‌కు తొలి స్వర్ణం అందించగా... సైక్లిస్ట్‌ సోఫీ థార్న్‌హిల్‌ మహిళా పారా సైక్లింగ్‌లో, స్విమ్మింగ్‌లో ఐమీ విల్మోట్‌, జేమ్స్‌ విల్బీ, ఎలేనర్‌ రాబిన్సన్‌, థామస్‌ హామెర్‌ స్వర్ణ పతకాలు నెగ్గారు.

ఇక, 21వ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిస్తోన్న ఆస్ట్రేలియా ఐదు స్వర్ణాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ గేమ్స్‌లో ఆస్ట్రేలియా రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. సైక్లింగ్‌లో పురుషుల టీమ్‌ పర్స్యూట్‌, మహిళల 4-100 మీ. ఫ్రీస్టయిల్‌ రిలేలో ఆసీస్‌ కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.

తొలిరోజు భారత్‌కు రెండు విజయాలు

తొలిరోజు భారత్‌కు రెండు విజయాలు

తొలిరోజు బ్యాడ్మింటన్‌లో భారత్ రెండు విజయాలు నమోదు చేసింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ప్రిలిమినరీ రౌండ్స్‌లో భారత్ వరుసగా 5-0తో శ్రీలంకపై 5-0తో పాకిస్థాన్‌లపై విజయం సాధించింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-16, 22-20తో మురాద్ అలీపై, సైనా నెహ్వాల్ 21-7, 21-11తో మహుర్ షహజాద్‌పై, పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా, చిరాగ్ షెట్టి 21-9, 21-15తో ఇర్ఫాన్ సయీద్-మురాద్ అలీపై నెగ్గారు. ఇక, మహిళల డబుల్స్‌లో అశ్విని-రుత్విక 21-6, 21-10తో మహూర్ షహజాద్-పల్వా షా బషీర్‌పై, మిక్స్‌డ్‌లో సాత్విక్-సిక్కీ రెడ్డి 21-10, 21-13తో ఇర్ఫాన్ సయీద్-పల్వాషా బషీర్‌పై గెలిచారు.

టేబుల్ టెన్నిస్‌లో ముందంజ

టేబుల్ టెన్నిస్‌లో ముందంజ

టేబుల్ టెన్నిస్‌లో పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. మహిళల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ వరుసగా 3-0తో శ్రీలంకపై, 3-0తో వేల్స్‌పై, పురుషుల క్యాటగిరీలో భారత్ వరుసగా 3-0తో ట్రినిడాడ్ అండ్ టుబాగోపై, 3-0తో నార్తర్న్ ఐర్లాండ్‌పై గెలిచాయి.

రెండో రౌండ్‌లోకి బాక్సర్ మనోజ్ కుమార్

రెండో రౌండ్‌లోకి బాక్సర్ మనోజ్ కుమార్

పురుషుల 50 కేజీల తొలి బౌట్‌లో మనోజ్ కుమార్ 5-0తో ఒసితా ఉమే (నైజీరియా)పై గెలిచాడు. స్విమ్మింగ్‌లో వీరధవల్ ఖడే, హరి నటరాజ్ సెమీస్‌లోకి ప్రవేశించారు. పురుషుల ఆర్టిస్టిక్స్ రింగ్స్ అపారటస్ విభాగంలో భారత జిమ్నాస్ట్ రాకేశ్ పాత్రా ఫైనల్లోకి ప్రవేశించాడు. రింగ్స్‌లో 13.950, పారెల్లల్‌లో 13.350 పాయింట్లు సాధించాడు.

 నిరాశపరిచిన మహిళల హాకీ జట్టు

నిరాశపరిచిన మహిళల హాకీ జట్టు

గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టుకు పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-3తో తమకంటే తక్కువ ర్యాంక్ ప్రత్యర్థి వేల్స్ చేతిలో ఓడింది. భారత్ తరఫున రాణి రాంపాల్ (34వ ని.), నిక్కీ ప్రధాన్ (41వ ని.) గోల్స్ చేయగా, లిసా డాలీ (7వ ని.), సియాన్ ఫ్రెంచ్ (26వ ని.), నటాషా మార్క్ జోన్స్ (57వ ని.) వేల్స్‌కు గోల్స్ అందించారు.

సౌరభ్‌ ఘోషల్‌కు షాక్‌

సౌరభ్‌ ఘోషల్‌కు షాక్‌

భారత టాప్ స్కాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్‌కు గేమ్స్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. పురుషుల విభాగంలో మూడోసీడ్ సౌరవ్ 11-5, 11-7, 8-11, 9-11, 10-12తో క్రిస్టోఫర్ బిన్నీ (జమైకా) చేతిలో, హరీందర్ పాల్ సంధూ రెండో రౌండ్‌లో 8-11, 6-11, 1-11తో ఇవాన్ యువాన్ (మలేసియా) చేతిలో పరాజయం పొందాడు. విక్రమ్, దీపికా పల్లికల్, జోష్న చినప్ప ప్రత్యర్థులపై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.

బ్రొంట్‌, కేట్‌ క్యాంప్‌బెల్‌ అరుదైన ఘనత

బ్రొంట్‌, కేట్‌ క్యాంప్‌బెల్‌ అరుదైన ఘనత

ఆస్ట్రేలియా అక్కాచెల్లెళ్లు బ్రొంట్‌, కేట్‌ క్యాంప్‌బెల్‌ అరుదైన ఘనత సాధించారు. కామన్వెల్త్‌ క్రీడల మహిళల స్విమ్మింగ్‌ 4×100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో సహచర స్విమ్మర్లు జాక్‌, ఇమాతో కలిసి బ్రొంట్‌, కేట్‌ 3:30.05 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ రేసులో కెనడా, ఇంగ్లాండ్‌ రజత, కాంస్య పతకాలు సాధించాయి.

11 ఏళ్లకే కామన్వెల్త్‌లో అరంగేట్రం

11 ఏళ్లకే కామన్వెల్త్‌లో అరంగేట్రం

కామన్వెల్త్ గేమ్స్‌లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. 11 ఏళ్లకే కామన్వెల్త్‌లో అరంగేట్రం చేసింది ఓ బాలిక. వేల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అనా హుర్సె టేబుల్‌టెన్నిస్‌ డబుల్స్‌లో చార్లోటె కారెతో కలిసి భారత సీనియర్‌ జోడీ మధురిక పట్కర్‌-మౌమాదాస్‌లను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. హుర్సె తనకు 8 ఏళ్లు ఉన్నప్పటి నుంచి టేబుల్ టెన్నిస్‌లో శిక్షణ పొందుతోంది.

Story first published: Friday, April 6, 2018, 11:34 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి