న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Neha Goyal: సైకిల్ ఫ్యాక్టరీలో బాల్యం.. రెక్కాడితే డొక్కాడని పేదరికం.. పూట భోజన కోసం హాకీ ప్లేయర్‌గా.!

Neha Goyal’s journey from cycle factory to Tokyo Olympics 2021

న్యూఢిల్లీ: నేహా గోయల్.. మరో 20 రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తరఫున బరిలోకి దిగుతోంది. ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పోటీపడాలని ప్రతి ఒక్క అథ్లెట్‌ కనే కలకు అడుగు దూరంలో నిలిచింది. కానీ ఆమె జీవిత ప్రయాణం గురించి తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు. సినిమాను తలపించే ఆమె గాథ అందరికి స్పూర్తిదాయకం. మురుగు నీరు ప్రవహించే ఓపెన్‌ నాలా పక్కనే ఓ చిన్న ఇల్లు.. రోజూ తాగి వచ్చి గొడవ చేసే తండ్రి.. భయపడి కళ్లు, చెవులు మూసుకుని తల్లి వెనకాల దాక్కునే ముగ్గురు ఆడపిల్లలు.. కుటుంబ పోషణ కోసం ఇతరుల ఇళ్లలో, ఫ్యాక్టరీలో పని చేసే ఆ తల్లి.. ఆమెకు సాయంగా వెళ్లే ముగ్గురు పిల్లలు. కట్‌ చేస్తే.. ఇప్పుడా ముగ్గురిలో చిన్నమ్మాయే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో దేశం తరపున ప్రాతినిథ్యం వహించబోతుంది. ఆమె మన నెహా గోయల్.!

సైకిల్ ఫ్యాక్టరీలో..

సైకిల్ ఫ్యాక్టరీలో..

హరియాణాలోని సోనెపట్‌కు చెందిన నేహ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. కటిక పేదరికంలో ఉన్నా.. మూడు పూటల తినడమే గగనమైనా.. ఆటనే నమ్ముకున్న ఆమె.. అద్భుత నైపుణ్యాలతో అంచెలంచెలుగా ఎదిగింది. బాల్యం నుంచి తోడుగా నిలిచిన అమ్మ సావిత్రి దేవి అండతో.. అన్నీతానై ప్రోత్సహించిన కోచ్‌ ప్రీతమ్‌ సివాచ్‌ చలవతో ఇంత దూరం రాగలిగింది. తండ్రి తాగి ఇంటికి వచ్చి నానా వీరంగం సృష్టించడం.. కుటుంబ బాధ్యతను భుజాలకెత్తుకున్న తల్లి పనికి వెళ్లడం.. ఇవే బాల్యంలో నేహకు కనిపించిన దృశ్యాలు. అమ్మకు సాయంగా ఉండడం కోసం తన ఇద్దరక్కలతో కలిసి నెలకు రూ.2 వేల కోసం ఆమె కూడా సైకిల్‌ ఫ్యాక్టరీలో పనికి వెళ్లింది. కానీ ఆటల మీద ఇష్టం ఉండే ఆమె ప్రతి రోజూ మైదానం బయట కనిపిస్తూనే ఉండేది.

రెండు పూటల భోజనం కోసం..

రెండు పూటల భోజనం కోసం..

హాకీ అకాడమీ నడిపే మాజీ క్రీడాకారిణి, కోచ్‌ ప్రీతమ్‌ సివాచ్‌ కళ్లలో పడడం వల్ల నేహ జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఓ సారి నేహకు తాడు ఇచ్చి స్కిప్పింగ్‌ చేయమని ప్రీతమ్‌ చెప్పింది. తన సామర్థ్యానికి ఆశ్చర్యపోయిన ప్రీతమ్‌.. హాకీ ఆడితే రోజుకు రెండు పూటలా భోజనం పెడతానని చెప్పింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించేందుకు వాళ్ల ఇంటికి కూడా వెళ్లింది. కూతురు ఇంట్లో కంటే హాకీ మైదానంలోనే సురక్షితంగా ఉంటుందని భావించిన నేహ తల్లి 11 ఏళ్ల వయసులో తనను అకాడమీలో చేర్పించింది. అప్పటి నుంచి నేహ పూర్తి బాధ్యత కోచ్‌ తీసుకుంది. ఆమె ప్రతి అవసరాన్నీ తీర్చి అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది.

పొట్టిగా ఉన్నా..

పొట్టిగా ఉన్నా..

చిరుత వేగం, గోల్స్‌ చేయడంలో కచ్చితత్వంతో ఎదిగిన నేహ 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసింది. జాతీయ కోచ్‌ మారిజ్నె శిక్షణలో చురుకైన అటాకర్‌గా మారి.. ప్రత్యర్థి డిఫెన్స్‌ చేదించడంలో పట్టు సాధించింది. రైల్వేలో ఉద్యోగం సాధించిన ఈ 4.9 అడుగుల ప్లేయర్.. తక్కువగా ఉండే తన ఎత్తును అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులకు చిక్కకుండా పరుగులు తీస్తూ ఆటలో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చిరునవ్వును వదలని నేహ.. తన సంపాదనతో జూనియర్‌ క్రీడాకారిణులకు సాయం చేస్తుండటం విశేషం. అలాగే తన ఎదుగుదలకు కారణమైన అకాడమీకి కూడా అండగా నిలుస్తోంది.

తనలాంటి ప్లేయర్ల కోసం..

తనలాంటి ప్లేయర్ల కోసం..

ఇటీవలే ఓ అపార్ట్‌మెంట్లో ఇల్లు తీసుకున్న నేహ తన తల్లితో కలిసి అందులో నివసిస్తోంది. ఆ ఇంట్లో ఓ రెండు గదులను ఖాళీగా ఉంచి.. ప్రీతమ్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ వసతి సౌకర్యం లేని ప్లేయర్లకు అందులో ఆశ్రయం కల్పిస్తోంది. 2018 ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన నేహ.. టోక్యో ఒలింపిక్స్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసే దిశగా సన్నద్ధమవుతోంది. స్పూర్తిదాయకమైన నేహా గోయల్ జీవిత ప్రయాణాన్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌కీబాత్‌లో ప్రస్తావించారు. ఒలింపిక్స్‌లో ఆమె అద్భుతంగా రాణించి దేశానికి పతకం అందించాలని మనం కూడా కోరుకుందాం!

Story first published: Saturday, July 3, 2021, 18:05 [IST]
Other articles published on Jul 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X