కామన్వెల్త్‌కు హాకీ జట్టు ప్రకటన: కెప్టెన్‌గా మనుప్రీత్, సర్దార్‌కు దక్కని చోటు

Posted By:
Manpreet to lead India, Sardar left out

హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌కు భారత హాకీ జట్టుని మంగళవారం హాకీ ఇండియా ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ వేదికగా జరగనున్న ఈ గేమ్స్‌కు 18 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి మిడ్ ఫీల్డర్ మనుప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు.

సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌ను తప్పించారు. గ‌త కొద్ది రోజుల నుంచి నిల‌క‌డ‌గా రాణించ‌లేక‌పోవ‌డంతో హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే మలేసియా వేదికగా ముగిసిన అజ్లాన్ షా హాకీ కప్ టోర్నీలో సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు చెత్త ప్రదర్శనను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరో ఆటగాడు రమణ్‌దీప్‌ సింగ్‌కు కూడా ఉద్వాసన పలికారు. గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ తిరిగి జట్టులోకి రాగా.. అతనికి సహకారం అందించేందుకు సూరజ్ కర్‌కీరాను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హాకీ ఇండియా హెడ్ కోచ్ సోజెర్డ్ మారిజ్నె మాట్లాడుతూ '2017 ఆసియాకప్ నుంచి ఇప్పటి వరకు జరిగిన టోర్నమెంట్లలో క్రీడాకారుల ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని తాజాగా జట్టును ఎంపిక చేశాం. గతంలో జరిగిన ఈవెంట్లలో వివిధ రకాల కాంబినేషన్లను పరిశీలించాం. గోల్డ్‌కోస్ట్‌లో అత్యుత్తమమైన, సత్తా చాటగల జట్టు ఇదేని భావిస్తున్నాం' అని అన్నారు.

ఇదిలా ఉంటే కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు బంగారు పతకం సాధించలేదు. ఫూల్-బీలో ఉన్న భారత్.. పాకిస్థాన్, మలేషియా, వేల్స్, ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

గతేడాది మనుప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు ఆసియా కప్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ లీగ్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ టోర్నీలో భాగంగా భారత హాకీ జట్టు ఏప్రిల్ 7న దాయది దేశమైన పాకిస్థాన్‌తో తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

కామన్వెల్త్ గేమ్స్‌కు భారత హాకీ జట్టు:
గోల్ కీపర్స్:

1. పిఆర్ శ్రీజేష్
2. సూరజ్ కర్కరా

డిఫెండర్స్:
3. రూపిందర్ పాల్ సింగ్
4. హర్మన్‌ప్రీత్ సింగ్
5. వరుణ్ కుమార్
6. కోతజిత్ సింగ్ కడంగ్బాం
7. గురీందర్ సింగ్
8. అమిత్ రోహిదాస్

మిడ్ ఫీల్డర్స్:
9. మన్‌ప్రీత్ సింగ్ (సి)
10. చింగ్లెన్‌సన సింగ్ కుంజాంజం (VC)
11. సుమిత్
12. వివేక్ సాగర్ ప్రసాద్

ఫార్వర్డ్స్:
13. ఆకాశ్‌దీప్ సింగ్
14. సునీల్ సొవమార్పే విలాపచార్య
15. గుజాంత్ సింగ్
16. మండిప్ సింగ్
17. లలిత్ కుమార్ ఉపాధ్యాయ
18. దిల్‌ప్రీత్ సింగ్

Story first published: Tuesday, March 13, 2018, 13:07 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి