రాబెన్ దెబ్బతో నెదర్లాండ్స్ విజయం

By Santaram
డర్బన్‌: స్టార్ ఆటగాళ్ళున్న నెదర్లాండ్స్‌ ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్‌ కు దూసుకెళ్లింది. స్లొవేకియా సంచలనాలకు తెరదించింది. ఆరంభంలో రాబెన్‌..ఆఖర్లో స్నైడర్‌ మెరవడంతో సోమవారం జరిగిన ప్రి క్వార్టర్‌ ఫైనల్లో డచ్‌ జట్టు 2-1 గోల్స్‌తో స్లొవేకియాను ఓడించింది. రాబెన్‌ (18వ నిమిషం) తనదైన శైలిలో గోల్‌ కొట్టి నెదర్లాండ్స్‌కు ఆధిక్యాన్నివ్వగా..ద్వితీయార్ధంలో స్నైడర్‌ (84వ) గోల్‌ చేశాడు. ఇంజురీ సమయంలో విటెక్‌ (90+4) గోల్‌ స్లొవేకియాకు వూరట. నెదర్లాండ్స్‌ తన స్థాయికి తగ్గట్లు ఆడకపోయినా స్లొవేకియాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గ్రూప్‌ ఆఖరి మ్యాచ్‌లో ఇటలీకి షాకిచ్చిన స్లొవేకియా కూడా ఆ పోరాటాన్ని పునరావృతం చేయలేకపోయింది. అర్జెంటీనా తర్వాత నాలుగు విజయాలతో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన జట్టు నెదర్లాండ్స్‌. రాబెన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

కీలక మ్యాచ్‌లో స్టార్‌ స్త్ట్రెకర్‌ అర్జెన్‌ రాబెన్‌ రాక నెదర్లాండ్స్‌ అదృష్టం. విరామానికి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి మ్యాచ్‌పై పట్టు సాధించిందంటే కారణం రాబెనే. గాయం కారణంగా గ్రూప్‌ దశలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమై, కామెరూన్‌తో 20 నిమిషాలే ఆడిన అతడు..ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. టోర్నీలో తొలిసారి ప్రారంభ లైనప్‌లో ఉన్న రాబెన్‌..తన ట్రేడ్‌మార్క్‌ గోల్ ‌తో 18వ నిమిషంలో జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. స్నైడర్‌ నుంచి చక్కని లాంగ్‌ పాస్‌ను అందుకున్న రాబెన్‌..స్లొవేకియా డిఫెండర్లను తప్పించుకుంటూ వెళ్లి ఎడమ కాలితో అద్భుతంగా గోల్‌ కొట్టాడు. 25 గజాల దూరం నుంచి బంతిని నెట్లోకి పంపాడు. నిజానికి రాబెన్‌ గోల్‌ చేసేంతవరకు స్లొవేకియా బాగా ఆడింది. చక్కని గోల్‌ అవకాశాలను సృష్టించుకుంది. ఆరంభంలో జెండ్రిసెక్‌ (స్లొవేకియా) కొట్టిన షాట్‌ క్రాస్‌ బార్‌కు కొద్దిగా పై నుంచి వెళ్లింది. హాంసిక్‌ (స్లొవేకియా) బంతిని దూరంగా తన్నాడు. మరికొన్ని అవకాశాలను స్లొవేకియా వృథా చేసుకుంది. ఐతే రాబెన్‌ గోల్‌ తర్వాత నెదర్లాండ్స్‌ మరింత ధాటిగా ఆడింది. స్లొవేకియా గోల్‌ పోస్ట్ ‌పై పదే పదే దాడులు చేసింది. కానీ షాట్లు గురితప్పాయి. స్నైడర్‌, రాబెన్‌, రాబిన్‌ వాన్‌ పెర్సీ అనేకసార్లు స్లొవేకియా డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లారు. ఐతే తొలి అర్ధభాగం ఆఖర్లో నెదర్లాండ్స్‌ మళ్లీ కాస్త నెమ్మదించింది.

ద్వితీయార్ధంలోనూ నెదర్లాండ్స్‌ జోరును కొనసాగించింది. ముఖ్యంగా రాబెన్‌. అతడి షాట్‌ను స్లొవేకియా గోల్‌ కీపర్‌ ముచా అద్భుతంగా అడ్డుకున్నాడు. తర్వాత వాండర్‌ వీల్‌ షాట్‌ నేరుగా ముచా చేతుల్లోకి వెళ్లింది. డచ్‌ మిడ్‌ఫీల్డ్‌ బలంగా ఉండడంతో బంతి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే స్లొవేకియా నియంత్రణలోకి వెళ్లింది. స్లొవేకియా జట్టులో మిరొస్లవ్‌ స్టాచ్‌, రాబర్ట్‌ విటెక్‌ గోల్స్‌ చేసేలా కనిపించారు. కానీ అవకాశాలను వృథా చేశారు. నెదర్లాండ్స్‌ స్త్ట్రెకర్లు మాత్రం స్లొవేకియా డిఫెండర్లకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వలేదు.

ఫలితమే 84వ నిమిషంలో రెండో గోల్‌. చేసింది స్నైడర్‌ అయినా అందులో డిర్క్‌ క్యుట్‌ శ్రమే ఎక్కువ. డిఫెన్స్‌ ఛేదిస్తూ గోల్‌పోస్ట్‌కు దగ్గరకు దూసుకెళ్లిన క్యుట్‌ను ముచా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ క్యుట్‌ అతణ్ని బోల్తా కొట్టించి స్నైడర్‌కు పాస్‌ అందించాడు. స్నైడర్‌ అలవోకగా గోల్‌ కొట్టాడు. నెదర్లాండ్స్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆఖరి క్షణాల్లో లభించిన పెనాల్టీని విటెక్‌ గోల్‌గా మలవడం స్లొవేకియాకు ఊరట. మ్యాచ్‌లో అదే చివరి కిక్‌. ప్రపంచకప్‌లో విటెక్‌కు ఇది నాలుగో గోల్‌ కావడం విశేషం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Story first published: Tuesday, June 29, 2010, 8:27 [IST]
Other articles published on Jun 29, 2010
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X