ఫిఫా వరల్డ్ కప్ 2022కు ఆతిథ్యం ఇస్తున్న ఖతర్ తన పేరిట చెత్త రికార్డు లిఖించుకుంది. గ్రూప్ దశలో తను ఆడిన చివరి మ్యాచ్‌లో కూడా నెదర్లాండ్స్ చేతిలో ఈ జట్టు ఓడింది. దీంతో వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం ఇస్తూ.. గ్రూప్ దశలో ఆడిన మ్యాచులన్నీ ఓడిన తొలి దేశంగా చెత్త రికార్డు సృష్టించింది. గ్రూప్ఏ లో భాగంగా నెదర్లాండ్స్, ఖతర్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచే నెదర్లాండ్స్ జట్టు జోరు మీద కనిపించింది. ఖతర్ నుంచి వారికి ఎలాంటి ప్రతిఘటనా ఎదురవలేదు. దీంతో నెదర్లాండ్స్ ఆటగాళ్లు గోల్స్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 26వ నిమిషంలో డేవీ క్లాసెన్ అందించిన చక్కటి పాస్‌ను చటుక్కున అందుకున్న కోడీ గాపో ఈ మ్యాచ్‌లో తొలి గోల్ సాధించాడు.
ఆ తర్వాత నాలుగు నిమిషాల్లోనే మెంఫిస్ డెపే మరో గోల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అతని షాట్ మిస్ అయింది. ఈ సమయంలో మెరుపు వేగంతో స్పందించిన ఫ్రాంకీ డీ జాంగ్.. ఈ రీబౌండ్‌ను గోల్ చేశాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా నెదర్లాండ్స్ ఆటగాళ్లు మరిన్ని గోల్స్ చేసేందుకు ప్రయత్నించినా వారి వ్యూహాలు ఫలించలేదు.
చివరగా 69వ నిమిషంలో స్టీవెన్ బెర్గూయిస్ మరో గోల్ చేశాడు. కానీ ఈ గోల్ చేసే క్రమంలో అతని చేతికి బంతి తాకినట్లు తేలడంతో ఆ గోల్‌ను రిఫరీలు లెక్కించలేదు. ఆట ముగిసే సమయానికి నెదర్లాండ్స్ జట్టు రెండు గోల్స్ ఆధిక్యంలో నిలిచి నాకౌట్స్ చేరుకుంది. ఈ జట్టు నాకౌట్స్‌లో భాగంగా శనివారం నాడు గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టును ఎదుర్కొంటుంది. ఇరాన్‌ను ఓడించిన యూఎస్ఏ జట్టు.. గ్రూప్ బిలో రన్నరప్‌గా నిలిచింది. అంటే ఈ రెండు జట్లు శనివారం నాడు తాడో పేడో తేల్చుకోనున్నాయి.