క్రికెట్‌లో అద్భుతం: రెండు చేతులతో బౌలింగ్ చేస్తున్న అక్షయ్ (వీడియో)

Posted By:

హైదరాబాద్: ఇది క్రికెట్‌లో అద్భుతమనే చెప్పాలి. ఇప్పటివరకు మనం రెండు చేతులతో బౌలింగ్ చేసే బౌలర్‌ను చాలాసార్లు చూసి ఉంటాం. కానీ రెండు చేతులతో అదేస్థాయిలో బంతులు సంధించే సూపర్ బౌలర్‌ని మాత్రం చూడలేదు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది.

సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరిస్ ఆరంభం కానుంది. అయితే ఈ సిరిస్ ఆరంభానికి ముందు సెప్టెంబర్ 12 (మంగళవారం) ఆస్ట్రేలియా జట్టు, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో విదర్భకు చెందిన యువ బౌలర్ అక్షయ్ కర్నెవార్ అద్భుతం చేసి చూపాడు.

దేశవాళీ క్రికెట్‌లో విదర్భ జట్టుకు

దేశవాళీ క్రికెట్‌లో విదర్భ జట్టుకు

దేశవాళీ క్రికెట్‌లో 24 ఏళ్ల అక్షయ్ కర్నెవార్ విదర్భ జట్టుకు ఆడుతున్నాడు. తన కెరీర్ తొలి నాళ్లలో కుడిచేతి స్పిన్‌తో పాటు ఎడమచేతి బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగేవాడు. రానురాను తన ప్రతిభను మెరుగుపరచుకున్నాడు. స్విచ్‌షాట్ కొట్టేటప్పుడు బ్యాట్స్‌మన్ తన స్టాండ్స్ మార్చే తరహాలోనే తన బౌలింగ్‌ను బ్యాట్స్‌మన్‌కు తగ్గట్లు మార్చుకున్నాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో వెలుగులోకి

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో వెలుగులోకి

గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా అక్షయ్ బౌలింగ్ శైలిలో ప్రత్యేకత ఏంటో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి అలా బౌలింగ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన బౌలింగ్ శైలిని ఏర్పరచుకున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపోయేలా చేశాడు.

అక్షయ్ బౌలింగ్ శైలికి ముగ్ధులైన ఆసీస్ క్రికెటర్లు

అక్షయ్ బౌలింగ్ శైలికి ముగ్ధులైన ఆసీస్ క్రికెటర్లు

మంగళవారం ఆసీస్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ టిమ్‌హెడ్‌కు కుడిచేత్తో బౌలింగ్ చేసిన అక్షయ్.. కుడిచేతి వాటమైన స్టోయినిస్‌కు లెఫ్ట్‌ఆర్మ్ బౌలింగ్ చేశాడు. దీంతో డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు అక్షయ్ బౌలింగ్ శైలికి ముగ్ధులయ్యారు. ఈ మ్యాచ్‌లో తన మెరుగు ఇన్నింగ్స్‌తో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టోయినిస్... అక్షయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

ప్రశంసల వర్షం కురిపించిన స్టోయినిస్

'అక్షయ్ బౌలింగ్ వేసే క్రమంలో అంపైర్ ఏం చెబుతున్నాడో మొదట అర్థం కాలేదు. అతను నీకు లెఫ్ట్‌ఆర్మ్‌తో బౌలింగ్ చేయబోతున్నాడని ఆ తర్వాత అర్థమైంది. అక్షయ్‌ది అద్భుత ప్రతిభ. నేను ఇప్పటి వరకు ఇలాంటి బౌలర్‌ను ఎప్పుడూ చూడలేదు' అని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మార్కస్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, September 14, 2017, 12:08 [IST]
Other articles published on Sep 14, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి