క్రికెటర్లకు భారీగా జీతాలు: పెంపు వెనుక ఉన్నదెవరో తెలుసా?

Posted By:
Virat Kohli, MS Dhoni the Reason Behind Massive Pay Hike for Indian Cricketers

హైదరాబాద్: తాజా కాంట్రాక్టుతో టీమిండియా క్రికెటర్లు భారీ మొత్తంలో జీతాలు తీసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జీతాల పెంపు అనేది అన్ని స్థాయిల్లోనూ ఉండటం విశేషం. అయితే ఈ జీతాల పెంపు నిర్ణయం వెనుక కెప్టెన్‌ కోహ్లీ, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీల ప్రమేయం ఉందని సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు.

జాక్ పాట్ కొట్టిన రోహిత్, ధావన్‌లు, వీళ్ల తర్వాతే కోహ్లీ..

ఇటీవల ప్రకటించిన కాంట్రాక్టులో బీసీసీఐ కొత్త గ్రేడ్ సిస్టమ్‌ను A+: రూ.7 కోట్లు, A: రూ.5 కోట్లు, B: రూ.3 కోట్లు, C: రూ. 1 కోటి ఇలా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అంతకముందు విధానంలో A+ గ్రేడ్ ఉండేది కాదు. కేవలం A, B, C గ్రేడ్‌లు మాత్రమే ఉండేవి.

గ్రేడ్ Aలో ఉన్నవారికి రూ. 2 కోట్లు, గ్రేడ్ Bలో ఉన్నవారికి రూ. కోటి, గ్రేడ్ Cలో ఉన్నవారికి రూ. 50 లక్షలు ఇచ్చేవారు. అయితే మూడు ఫార్మాట్లలో ఆడుతూ, నిలకడగా రాణించే ఆటగాళ్ల కోసం 'A+' గ్రేడ్‌ (రూ.7 కోట్ల వార్షిక వేతనం) తేవడంలో వీళ్లిద్దరి అభిప్రాయాలు కీలకమయ్యాయని రాయ్‌ చెప్పారు.

'ఆటగాళ్ల జీతాల పెంపు చర్చల సందర్భంగా A+ గ్రేడ్‌ గురించి కోహ్లీ, ధోనీలే సలహా ఇచ్చారు. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న వాళ్లకు ఇందులో చోటుండాలనేది వారి ఆలోచన. ప్రదర్శన ఆధారంగానే ఇందులో చోటు దక్కాలని వారు అభిప్రాయపడ్డారు' అని వినోద్ రాయ్ తెలిపారు.

'కాబట్టి ఎవరూ ఇందులో శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. బాగా ఆడిన వాళ్లకు ఈ విభాగంలో చోటు దక్కుతుంది. లేదంటే లేదు. మాకు ఎంత డబ్బు వస్తుందనే దానిపై ఎటువంటి బాధ లేదని చెప్పారు. మిడిల్ లెవల్ ఆటగాళ్లకు ఇస్తే బాగుంటుంది. ఈ విషయంలో వారిద్దరూ కరెక్ట్‌గా ఉన్నారు' అని రాయ్ అన్నాడు.

టాప్ గ్రేడ్ నుంచి ధోని ఔట్, జాడలేని షమీ: క్రికెటర్లకు భారీగా పెరిగిన జీతాలు

బీసీసీఐ తాజాగా ప్రకటించిన కాంట్రాక్టుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలు A+ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 'A' గ్రేడ్‌లో ధోనీ కాకుండా మరో ఆరుగురు ప్లేయర్స్ ఉన్నారు. అశ్విన్, జడేజా, మురళీ విజయ్, పుజారా, రహానే, సాహా ఈ కేటగిరీలో స్థానం సంపాదించారు.

గ్రేడ్ 'B'లో.. రాహుల్, ఉమేష్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్, చాహల్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, దినేష్ కార్తీక్‌లు ఉన్నారు. 'C' గ్రేడ్‌లో.. కేదార్ జాదవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్ ఉన్నారు.

Story first published: Saturday, March 10, 2018, 12:40 [IST]
Other articles published on Mar 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి