ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గురువారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు అతిరథ మహారథులంతా హాజరయ్యారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లికి హాజరైన ప్రముఖులు.. రాత్రి వాంఖడే మైదానంలో మ్యాచ్‌ను ఆస్వాదించారు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు బిజినెస్ టైకూన్ అంబానీ కుటుంబం, బాలీవుడ్ సినీ తారలు, మాజీ క్రికెటర్లు, మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్‌తో పాటు అధికార యంత్రాంగం మొత్తం ఈ మ్యాచ్‌కు హాజరైంది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.

254 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది. అయితే జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ సామ్ కరణ్ డిఫెన్స్ చేశాడు. బంతి పిచ్ అయ్యి గాల్లోకి లేవగా.. బుమ్రా ఫాలో త్రూలో అందుకున్నాడు. ఇది క్యాచ్ అని పొరబడిన సాక్షి సింగ్.. ఎగిరి గంతేసింది. వెనుకాలే ఉన్న ధోనీ.. 'ఒసేయ్ అది ఔట్ కాదే.. కూర్చో'అని మందలించాడు. దాంతో ఔట్ కాదా? అని సాక్షి సింగ్ దిగాలుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి సైలెంట్‌గా కూర్చుంది. పక్కనే ఉన్న అంబానీ కోడలు రాధికా మర్చంట్ నవ్వు ఆపుకోలేకపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని బుమ్రా కళ్లు చెదిరే యార్కర్ సంధించగా.. సామ్ కరణ్ డిఫెన్స్ చేశాడు. బంతి పిచ్ అయ్యి గాల్లోకి లేవగా బుమ్రా ఒంటి చేత్తో తీసుకున్నాడు. ఇది క్యాచ్ అనుకున్న సాక్షి సింగ్ సంతోషంలో ఎగిరి గంతేసింది. కానీ ధోనీ అది క్యాచ్ కాదని చెప్పి ఆమెను శాంత పర్చాడు.
