తప్పగ నెగ్గాల్సిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (10), సూర్యకుమార్ యాదవ్ (6) ఇద్దరూ ఫెయిలయ్యారు. సూర్యకుమార్ యాదవ్‌ను ఆడమ్ మిల్నే పెవిలియన్ చేర్చాడు. అంతకుముందే బ్యాటింగకు వచ్చిన రిషభ్ పంత్ మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు.
డారియల్ మిచెల్ బౌలింగ్‌లో మైదానం వీడాడు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ (49) మరోసారి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. లోకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో అవుటయ్యాడు. దీంతో భారత జట్టు 125 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌పై భారం పడుతుంది. వీళ్లిద్దరూ కూడా అవుటైతే ఇక ఈ మ్యాచ్ కూడా భారత్ ఓడిపోతుంది. అదే జరిగితే సిరీస్‌ను 2- తేడాతో కివీస్ చేజిక్కించుకుంటుంది.
టాస్ గెలిచిన ఈ సందర్భంగా మాట్లాడిన కేన్ విలియమ్సన్.. పిచ్‌లో అనుకున్నంత దాని కన్నా ఎక్కువ బౌన్స్ కనపడుతోందని అన్నాడు. ఈ కారణంగానే బ్రేస్‌వెల్ స్థానంలో మళ్లీ ఆడమ్ మిల్నేను ఆడిస్తున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయమే అతనికి బాగా కలిసొచ్చింది. అదే సమయంలో భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవని, రెండో మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని శిఖర్ ధవన్ చెప్పాడు. అంటే దీపక్ హుడాను తీసుకొని సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచెయ్యి చూపించారన్నమాట.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఏమాత్రం చెప్పుకోదగిన ప్రదర్శనలు చేయని రిషభ్ పంత్‌ను మాత్రం వైస్ కెప్టెన్ హోదాలో టీమిండియా కొనసాగిస్తూనే వస్తోంది. అలాగే టీ20 వరల్డ్ కప్ నుంచి వరుసగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇస్తారని అనుకున్న అభిమానులకు కూడా నిరాశే మిగిలింది.
రెండో మ్యాచ్‌కు జరిగినట్లే ఈ మ్యాచ్‌కు కూడా టాస్ ఆలస్యమైంది. వర్షం పడటంతో మైదానాన్ని కవర్స్‌తో కప్పేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంత వర్షం తగ్గిన తర్వాత టాస్ వేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ మనసులో చాలా ఆందోళన తలెత్తుతోంది. రెండో మ్యాచ్‌లా ఇది కూడా వర్షం వల్ల రద్దయితే భారత్‌కు గట్టి దెబ్బ పడినట్లే. ఎందుకంటే తొలి వన్డేలో భారత్ ఓడిపోవడంతో ఈ సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది.
టీమిండియా: శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిల్యాండ్ జట్టు: డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లాథమ్, డారియల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్.