పాకిస్థాన్‌కు షాకిచ్చిన లంక: 2-0తో టెస్టు సిరిస్ కైవసం

Posted By:

హైదరాబాద్: పాకిస్థాన్‌కు గట్టి షాక్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో ఓటమి పాలైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని తమ సొంతగడ్డగా మార్చుకున్న తర్వాత టెస్టు సిరిస్ ఓడిపోవడం ఇదే తొలిసారి.

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 68 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 317 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 90.2 ఓవర్లకు గాను 248 పరుగులు చేసి ఆలౌటైంది. నాలుగో రోజైన సోమవారం అసద్ షఫిక్, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అద్భుత ప్రదర్శనతో గెలిచేలా కనిపించింది.

అయితే చివరి రోజైన మంగళవారం శ్రీలంక బౌలర్లు విజృంభించండతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. చివరిరోజు 50 పరుగులు జోడించి 5 వికెట్లు కోల్పోయింది. 5 వికెట్లకు 198 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ తొలి సెషన్‌లోనే మిగతా వికెట్లన్నీ కోల్పోయింది.

225 పరుగుల దగ్గర కెప్టెన్ సర్ఫరాజ్ (68) అవుట్ కావడంతో పాకిస్థాన్ వికెట్ల పతనం మొదలైంది. షఫిక్ (112)తో కలిసి ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించి సర్ఫరాజ్ (68) అవుటయ్యాడు. మిగతా 4 వికెట్లు 23 పరుగుల తేడాతోనే పాక్ కోల్పోవడం విశేషం. శ్రీలంక బౌలర్లలో పెరీరా 5 వికెట్లు తీయగా హెరాత్ 2, లక్మల్, గమాగీ, ఫెర్నాడో తలో వికెట్ తీసుకున్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన కరుణరత్నేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ అఫ్ ద సిరిస్ అవార్డు సైతం లభించింది. తాజా విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో శ్రీలంక నెగ్గింది. వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంకకు విదేశీ గడ్డపై ఇదొక అద్భుత విజయమనే చెప్పాలి.

Story first published: Tuesday, October 10, 2017, 18:13 [IST]
Other articles published on Oct 10, 2017
Please Wait while comments are loading...
POLLS