భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ మంగళవారం రిషబ్ పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ తన బ్యాటింగ్ స్థాయిని మరో రేంజుకు తీసుకెళ్లడమే కాకుండా టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా చాలా పరిణతి సాధిస్తున్నాడని పేర్కొన్నాడు. పంత్ తన వికెట్ కీపింగ్ బాధ్యతలను సీరియస్‌గా తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. రిషబ్ పంత్ బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ చేయబడిన అయిదో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 111బంతుల్లో 146పరుగులు చేసి.. భారత్ స్కోరు 400దాటడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ చేసిన రెండో ఇండియన్ వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయితే పంత్ బ్యాటింగ్లో రాణించినప్పటికీ.. ఇంగ్లాండ్ ఎటాకింగ్ గేమ్ వల్ల మ్యాచ్ ఇండియా చేజారింది. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక పరుగుల ఛేజింగ్ చేసి.. ఇండియాను బోల్తా కొట్టించింది. 378 పరుగులను కేవలం 3వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. జానీ బెయిర్‌స్టో, జో రూట్ అజేయంగా సెంచరీలు చేయడంతో పాటు 269పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ అయిదో రోజు తొలి సెషన్లో విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో పంత్ కీపింగ్, బ్యాటింగ్ పరంగా చాలా ఆకట్టుకున్నాడని మంజ్రేకర్ పేర్కొన్నాడు. 'పంత్ బ్యాటింగ్, కీపింగ్ పరంగా ఆకట్టుకున్నాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. అతను మనం చూస్తున్నకొద్దీ గొప్ప ప్లేయర్‌గా తనను తాను రూపొందించుకుంటున్నాడు. పంత్ టెస్టుల్లో 5 సెంచరీలు చేస్తే.. స్వదేశంలో అతను ఒక్క సెంచరీ మాత్రమే చేయగా.. విదేశాల్లో 4 సెంచరీలు చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విదేశీ గడ్డ మీద కూడా ఆడే కెపాబిలిటీ ఉన్న ప్లేయర్ అతను అని' పంత్ బ్యాటింగ్ నైపుణ్యాలను సంజయ్ మంజ్రేకర్ కొనియాడాడు.
స్పిన్నర్ల బౌలింగ్లో కీపింగ్ చేయగల పంత్ సామర్థ్యం గురించి చాలా ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. గతేడాది ఇంగ్లాండ్‌పై స్వదేశంలో గ్లోవ్స్‌తో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత టెస్టుల్లో వికెట్ కీపింగ్లో పంత్ ఫస్ట్-ఛాయిస్ అయ్యాడు. ఈ విషయమై మంజ్రేకర్ స్పందిస్తూ.. 'టీమిండియాకు మంచి వార్త ఏంటంటే.. వికెట్ కీపర్ పంత్ ఎదుగుదల. అతను ఇంతకుముందులా.. స్టంప్‌ల వద్ద ఎక్కువగా అరవడం చేయట్లేదు. అతను కీపింగ్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు కన్పించింది. ధోనీలాగే అతనిలో కూడా క్రమేపీ మెరుగుదల కన్పిస్తోంది. బ్యాటర్‌గా విజయవంతం అయితే కాస్త కీపింగ్లో నార్మల్‌గా ఉన్న సరిపోతదనే మెంటాలిటీ కంటే.. అత్యంత సీరియస్‌గా తీసుకోవాలనే విషయం అతని కీపింగ్లో ఇటీవల కన్పిస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది' అని మంజ్రేకర్ అన్నాడు.