ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయి దాడి: అశ్విన్ ఏమన్నాడో తెలుసా?

Posted By:

హైదరాబాద్: ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయి దాడిని టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఖండించాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు. ఇలాంటి చర్యలతో దేశానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నాడు.

'ఆసీస్‌ క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు విసరడం మంచిపని కాదు. ఇలాంటి పనులు దేశానికి అపకీర్తి తెచ్చిపెడతాయి. మనమంతా బాధ్యతాయుతంగా ఉండాలి' అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు.

అసలేం జరిగింది?
గువహటి వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్ల దాడి జరిగింది.

ఈ దాడిలో బస్సు అద్దం ధ్వంసమైంది. ఈ దాడికి సంబంధించిన ఫోటోను ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్‌ ట్విట్టర్‌లో అభిమానలతో పంచుకున్నాడు. 'హోటల్‌కు వెళ్తున్న దారిలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాయి విసరడం ఆందోళన కలిగించింది' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఈ ట్వీట్‌లో పగిలిన బస్సు అద్దం ఫొటోను కూడా జత చేశాడు. మరోవైపు ఈ ఘటనను భద్రతా సిబ్బంది చాలా సీరియస్‌గా తీసుకుంది. ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. క్రికెటర్లకు కల్పించిన భద్రతపై తాము సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే రాయి విసిరినప్పుడు విండో సీట్‌లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని క్రికెట్‌ ఆస్ట్రేలియా తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది. అయితే, ఈ ఘటన క్రికెటర్లను ఆందోళనకు గురి చేసినట్లు తెలిపింది.

Story first published: Wednesday, October 11, 2017, 14:29 [IST]
Other articles published on Oct 11, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి