డివిలియర్స్ సెంచరీ, రబాడ మ్యాజిక్: రెండో టెస్టులో పట్టు బిగించిన సఫారీలు

Posted By:
Rabada strikes late after De Villiers ton leaves Australia in trouble

హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగించింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అద్భుత సెంచరీ (146 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్‌తో 126 నాటౌట్‌)తో తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగుల ఆధిక్యం చేజిక్కించుకుంది.

Australia vs South Africa 2018 2nd Test Score Card

ఆ తర్వాత రబాడ (3/38) విజృంభించడంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్‌ ఖవాజా (75) ఒక్కడే సఫారీ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు.

ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్‌ (24), వార్నర్‌ (13)లతో పాటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (11), షాన్‌ మార్ష్‌ (1) విఫలమయ్యారు. ఐదో వికెట్‌కు మిచెల్ మార్ష్(39 నాటౌట్)తో కలిసి ఖవాజ 87 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిచెల్ మార్ష్ (39), టిమ్ షైనీ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు.

41 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా చేతిలో ఇంకా 5 వికెట్లు మాత్రమే మిగిలున్నాయి. అంతకుముందు 263/7 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 118.4 ఓవర్లలో 382 పరుగులకు ఆలౌటైంది. డివిలియర్స్ (126 నాటౌట్) సెంచరీని నమోదు చేశాడు.

ఫిలాండర్‌ (36)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు డివిలియర్స్ 84 పరుగులు జోడించగా... కేశవ్‌ మహరాజ్‌ (30)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ మూడు వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీశారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 0-1తో వెనుకబడిన సఫారీలు సోమవారం ఆస్ట్రేలియాను త్వరగా ఔట్ చేయగలిగితే రెండో టెస్టులో విజయం సాధిస్తుంది.

Story first published: Monday, March 12, 2018, 12:22 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి