ఆక్లాండ్: నెల రోజులుగా క్రికెట్ అభిమానులను అలరించిన టీ20 ప్రపంచకప్ 2021 ఆదివారం ముగిసిన విషయం తెలిసిందే. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఓడిన కివీస్.. పొట్టి వరల్డ్ కప్‌లో కూడా తేలిపోయింది. కివీస్ ఓటమిపై న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ స్పందించాడు. న్యూజిలాండ్ గన్ తీసుకుంది కానీ.. బుల్లెట్లు పేల్చలేదని సెటైర్ వేశాడు. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా.. సరైన ప్రదర్శన చేయలేకపోయారన్నాడు. తొలిసారి ప్రపంచకప్ అందుకునే సదవకాశాన్ని కివీస్ చేజార్చుకుందని మెక్‌కలమ్ అన్నాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం అందలేదు. స్టార్ ఆటగాళ్లు మార్టిన్ గప్టిల్ (28), డారిల్ మిచెల్ (11), గ్లెన్ ఫిలిప్స్ (18), జేమ్స్ నీషమ్ (13 నాటౌట్), టీమ్ సీఫెర్ట్ (8 నాటౌట్) ధాటిగా ఆడలేకపోయారు. తొలి పది ఓవర్లలో 57 పరుగులే చేసిన న్యూజిలాండ్.. కేన్ చెలరేగడంతో మిగతా 10 ఓవర్లలో 115 పరుగులు చేసింది. లేదంటే.. కివీస్ మోస్తరు స్కోరుకే పరిమితం అయ్యేది.
తాజాగా బ్రెండన్ మెక్‌కలమ్ మాట్లాడుతూ... 'మేము తుపాకి ఫైట్ కోసం కత్తిని తీసుకెళ్లామని నేను చెప్పట్లేదు. న్యూజిలాండ్ గన్ తీసుకుంది కానీ.. బుల్లెట్లు మాత్రం పేల్చలేదు. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా సరైన ప్రదర్శన చేయలేకపోయారు. ఫైనల్ పోరులో కివీస్ ప్లేయర్స్ కాస్త తడబడి టైటిల్ కొట్టే మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఏదేమైనా మేము తీసుకున్న బుల్లెట్లను కాల్చలేదు' అని అన్నాడు. ముందుగా బ్యాటింగ్‌లో తడబడిన కివీస్.. ఆపై బౌలింగ్‌లో కూడా తన సత్తాచాటలేదు. దాంతో లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది.
'నేను మార్టిన్ గప్తిల్ నుంచి మరింత మంచి ఇన్నింగ్స్ ఆశించాను. గప్తిల్ 35 బంతుల్లో 28 పరుగులే చేశాడు. ఆ పద్ధతి అస్సలు బాగోలేదు. అయితే అంతకుముందు 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు. తర్వాతి 20 బంతుల్లో 12 పరుగులే చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే.. అలాంటి పరిస్థితుల్లోనే దూకుడుగా ఆడాలి. అక్కడే న్యూజిలాండ్ వెనుకబడిపోయింది. కీలక సమయంలో పరుగులు చేయలేకపోయింది. మా బ్యాటింగ్‌పై నేను అసంతృప్తిగా ఉన్నా. ఆసీస్‌తో తలపడినప్పుడు మరింత దూకుడుగా ఆడాల్సింది' అని బ్రెండన్ మెక్‌కలమ్ పేర్కొన్నాడు.