న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్చ్‌! క‌ల‌ల సౌధం చెల్లాచెదురు!

New Zealand outclass India to advance to World Cup final

మాంచెస్ట‌ర్‌: మ‌రో నిరాశ‌. మ‌రో విఘాతం. అనూహ్య‌మై ఎదురుదెబ్బ‌. త‌ప్ప‌ని మ‌రో నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌. ఇంగ్లండ్ వేదిక‌గా ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న‌ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఆరంభంలో హాట్ ఫేవ‌రెట్‌గా బ‌రిలో దిగిన టీమిండియా... వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌త్య‌ర్థిని బెంబేలెత్తించిన టీమిండియా.. ఎదురు ప‌డాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించే ప‌రిస్థితిని ఎదుటి జ‌ట్టుకు క‌ల్పించిన టీమిండియా..ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఏడింట్లో ఘ‌న విజ‌యాల‌ను న‌మోదు చేసి సెమీ ఫైన‌ల్‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెట్టిన టీమిండియా.. స‌గ‌టు అభిమాని ఆశ‌ల‌ను కుప్పకూల్చింది. క‌ల‌ల సౌధాన్ని చెల్లాచెదురు చేసింది. మూడోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌ల‌ని మురిసిపోయిన స‌గ‌టు భార‌తీయ క్రికెట్ ప్రేమికుడిని నిరాశ‌ల అగాథంలోకి నెట్టేసింది. మ‌రో నాలుగేళ్ల పాటు నిరీక్షించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని క‌ల్పించింది.

ఆప‌ద్బాంధ‌వా!..మ్యాచ్ ర‌క్ష‌కా!!: గెలిపించాలంటూ ధోనీని ప్రార్థిస్తోన్న ఫ్యాన్స్‌!ఆప‌ద్బాంధ‌వా!..మ్యాచ్ ర‌క్ష‌కా!!: గెలిపించాలంటూ ధోనీని ప్రార్థిస్తోన్న ఫ్యాన్స్‌!

టాప్ ఆర్డ‌ర్ విఫ‌ల‌మైనా లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్ చేసిన ర‌వీంద్ర జ‌డేజా దూకుడుగా ఆడాడు. గెలుపుపై ఆశ‌ల‌ను చిగురింప‌జేశాడు. వీలు చిక్కిన ప్ర‌తీసారీ సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో కివీస్ బౌల‌ర్ల‌ను ఉతికేశాడు. 59 బంతుల్లోనే 77 ప‌రుగులు చేశాడు. ఓ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి అవుట్ అయ్యాడు. జ‌డేజా అవుటైన కొద్దిసేప‌టికే- గ‌ప్టిల్ సంధించిన ఓ డైరెక్ట్ త్రోకు మ‌హేంద్ర‌సింగ్ ధోనీ అవుట్ కావ‌డంతో టీమిండియా క‌థ ముగిసింది.

టాప్ ఆర్డ‌ర్ ట‌ప‌..ట‌పా!

ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ కీల‌క‌మైన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు. నాలుగు బంతుల‌ను ఎదుర్కొని రోహిత్‌.. ఒక్క ప‌రుగు చేసి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కీప‌ర్ టామ్ లాథ‌మ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోరు నాలుగు ప‌రుగులే. రోహిత్ శ‌ర్మ బోణీ బాగున్న‌ట్టుంది. అత‌ని వెనుకే పెవిలియ‌న్ దారి ప‌ట్టారు మిగ‌తా బ్యాట్స్‌మెన్లంద‌రూ. జ‌ట్టు స్కోరు అయిదు ప‌రుగుల వ‌ద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఏడు బంతులాడిన రాహుల్ కూడా ఒక ప‌రుగే చేశాడు. హెన్రీ బౌలింగ్‌లో కీప‌ర్ లాథ‌మ్ ప‌ట్టిన అద్భుత‌మైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. అదే స్కోరు వ‌ద్ద విరాట్ కోహ్లీ సైతం వ‌చ్చిన దారే ప‌ట్టాడు. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

నిల‌దొక్కుకోని మిడిలార్డ‌ర్‌..

అంతే! అక్కడి నుంచి ఏ ద‌శ‌లోనూ టీమిండియా కోలుకోలేక‌పోయింది. కోహ్లీ అవుటైన త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన దినేష్ కార్తిక్ కుదురుకోవ‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డాడు. ఒక ఫోర్ స‌హాయంతో ఆరు ప‌రుగులే చేశాడు. 25 బంతుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. దినేష్ కార్తిక్ క్రీజులో కుదురు కోలేక‌పోయాడు. హెన్రీ బౌలింగ్‌లో నీష‌మ్ ప‌ట్టిన క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. హెన్రీ బంతిని డీప్ మిడ్ వికెట్ వైపు ఆడ‌టానికి ప్ర‌య‌త్నించగా.. బంతి కాస్తా గాల్లోకి లేచింది. నీష‌మ్ స‌మీపం వాలింది. నేల‌ను తాక‌బోతున్న చివ‌రి సెకెన్‌లో దాన్ని అద్భుతంగా అందుకున్నాడు నీష‌మ్‌. ఎడ‌మ‌చేతి వైపు డైవ్ చేసి అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోరు నాలుగు వికెట్లకు 9.6 ఓవ‌ర్ల‌లో 24.

హార్దిక్‌, రిష‌బ్ కుదురుకున్న‌ప్ప‌టికీ..

ఒక‌వైపు వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ.. నాలుగో స్థానంలో వ‌చ్చిన రిష‌బ్ పంత్ కుదురుగా ఆడుతుండ‌టం ఎక్క‌డో ఓ మూల ఆశ‌ల‌ను క‌ల్పించింది. అత‌నికి హార్దిక్ పాండ్య తోడు కావ‌డం, ఇద్ద‌రూ క‌లిసి అడ‌పా ద‌డ‌పా షాట్లు కొడుతుండ‌టంతో గెలుపుపై ఓ మోస్త‌రు ఆశ‌లు చిగురించాయి. దీనికితోడు- న్యూజిలాండ్ ఫీల్డ‌ర్లు క్యాచ్‌లు జార‌విడుస్తూ రావ‌డం.. వారిపై పెరుగుతోన్న ఒత్తిడికి కార‌ణ‌మైంది. హార్దిక్ పాండ్య‌, రిషబ్ పంత్ ఆడుతున్నంత సేపూ గెలుపుపై ఆశ‌లు చిగురిస్తూ వ‌చ్చాయి. జ‌ట్టు స్కోరు 71 ప‌రుగుల వ‌ద్ద హార్దిక్ పాండ్య అవుట్ అయ్యాడు. శాంట్న‌ర్ బౌలింగ్‌లో మిడాన్ దిశ‌గా భారీ షాట్ ఆడ‌బోయాడు. బంతి కాస్త బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. కేప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ చేతుల్లో వాలింది..సుర‌క్షితంగా! దీనితో ఒక్క‌సారిగా స్టేడియం మూగబోయింది. 62 బంతుల్లో రెండు ఫోర్ల స‌హాయంతో పాండ్యా 32 ప‌రుగులు చేశాడు. మ‌రో 21 ప‌రుగులు జోడించిన త‌రువాత రిష‌బ్ పంత్ సైతం పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. 56 బంతుల్లో నాలుగు ఫోర్ల స‌హాయంతో శాంట్న‌ర్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు రిష‌బ్‌.

జ‌డేజా దూకుడు..

మ్యాచ్ మొత్తానికీ హైలైట్‌గా చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్ ఆడాడు ర‌వీంద్ర జ‌డేజా. లోయ‌ర్ మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ర‌వీంద్ర జడేజా.. ఎడాపెడా భారీ షాట్ల‌ను ఆడాడు. శాంట్న‌ర్ బౌలింగ్‌లో సిక్స‌ర్లు కొట్టాడు. బౌండరీల‌తో బెంబేలెత్తించాడు. ధోనీని స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ.. జ‌డేజాకు ఆడే అవ‌కాశాన్ని క‌ల్పించాడు. వారిద్ద‌రూ క్రీజులో ఉన్నంత సేపూ మ్యాచ్ భార‌త్ వైపే మొగ్గింది. ఓవ‌ర్‌కు ప‌దికి పైగా ప‌రుగులు చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ఎక్క‌డా అద‌ర లేదు, బెద‌ర‌లేదు. తొట్రుపాటు క‌నిపించ‌లేదు. బౌల‌ర్ ఎవ‌ర‌నేదీ లెక్క చేయ‌లేదు. షాట్ల‌ను కొడుతూ వెళ్లిపోయాడు జ‌డేజా. త‌న అర్ధ‌సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జ‌డేజా క్రీజులో ఉన్న స‌మ‌యంలో బంతులు, ర‌న్ల మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం కూడా త‌గ్గుతూ వ‌చ్చింది. జ‌డేజా-ధోనీ మ‌ధ్య 100 ప‌రుగుల భాగ‌స్వామ్యం ఏర్ప‌డింది. ఇక గెలుపుపై ఢోకా లేద‌నుకున్న ద‌శ‌లో జ‌డేజా అవుట్ అయ్యాడు.

మ‌లుపు తిప్పిన జ‌డేజా వికెట్‌..

48వ ఓవ‌ర్‌లో జ‌డేజా అవుట్ కావ‌డం మ్యాచ్‌ను మ‌లుపు త‌ప్పింది. బ్లాక్ క్యాప్స్ వైపు మొగ్గు చూపేలా చేసింది. 47.5 ఓవ‌ర్ వ‌ద్ద ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశ‌గా భారీ షాట్ ఆడ‌బోయాడు జ‌డేజా. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని విలియ‌మ్స‌న్ అందుకున్నాడు. దీనితో ఒక్క‌సారిగా మూగబోయింది స్టేడియం. అప్ప‌టికి జ‌ట్టు స్కోరు ఏడు వికెట్ల‌కు 208. క్రీజులో ధోనీ ఉండ‌టం, జ‌డేజా అవుటైన త‌రువాత ఎదుర్కొన్న తొలి బంతిని ధోనీ సిక్స‌ర్‌గా మ‌ల‌చ‌డంతో స్టేడియంలో మ‌రోసారి ఉత్సాహం క‌నిపించింది. అది ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. 216 ప‌రుగుల వ‌ద్ద ధోనీ ర‌నౌట్ అయ్యాడు. మార్టిన్ గ‌ప్టిల్ చేసిన డైరెక్ట్ త్రోకు బ‌ల‌య్యాడు ధోనీ. గెలుపు ఆశ‌లు అడుగంటాయి. ఫైన‌ల్ ద్వారాలు మూసుకుపోయాయి.

బ్లాక్ క్యాప్స్‌ను కాపాడిన ఆ 23 బంతులు..

రెండో రోజు మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ జ‌ట్టు రెండు వికెట్ల‌ను కోల్పోయింది. చివ‌రి 23 బంతుల్లో 28 ప‌రుగుల‌ను సాధించ‌గ‌లిగారు బ్లాక్ క్యాప్స్‌. ఆ ప‌రుగులే ఇప్పుడు ఆ జ‌ట్టును ర‌క్షించాయి. అసంపూర్తిగా ముగిసిన 47వ ఓవ‌ర్‌లో ఎనిమిది ప‌రుగుల‌ను రాబ‌ట్టుకున్నారు. 48వ ఓవ‌ర్‌లో ఎనిమిది ప‌రుగులు చేశారు. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఏడు ప‌రుగులు చొప్పున సాధించారు. ఈ క్ర‌మంలో మూడు వికెట్ల‌ను కోల్పోయింది న్యూజిలాండ్‌. మొత్తం 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 239 ప‌రుగుల‌ను చేసింది. టీమిండియా ముందు 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 48వ ఓవ‌ర్ చివ‌రి బంతికి రాస్ టేల‌ర్ ర‌నౌట్ అయ్యాడు. బుమ్రా బంతిని డీప్ స్క్వేర్‌లెగ్ వైపు ఆడాడు రాస్ టేల‌ర్‌.

భారీ ప‌రుగులు చేయ‌లేక‌పోయినా..

ఒక ర‌న్ పూర్తి చేశాడు. ఇంకో ర‌న్ కోసం ప్ర‌య‌త్నించాడు. ఇంకో ఎండ్‌లో ఉన్న టామ్ లాథ‌మ్ పిలుపు అందుకున్న టేల‌ర్‌.. రెండో ర‌న్ కోసం ప‌రుగెత్తాడు. ఆ లోపే డీప్ స్క్వేర్‌లెగ్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న ర‌వీంద్ర జ‌డేజా అద్భుతం చేశాడు. వికెట్ కీప‌ర్ వైపు బంతిని త్రో చేశాడు. నేరుగా వికెట్ల‌ను తాకిందా బంతి. అంతే. ఇంకో ఛాన్సే లేకుండా, రాస్ టేల‌ర్ పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. 49వ ఓవ‌ర్ తొలి బంతికి న్యూజిలాండ్ మ‌రో వికెట్‌ను కోల్పోయింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని భారీ షాట్ ఆడాడు టామ్ లాథ‌మ్‌. ఇక్క‌డ కూడా ర‌వీంద్ర జ‌డేజా త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించాడు. స్టాండ్స్ వైపున‌కు దూసుకెళ్తున్న ఆ బంతిని బౌండ‌రీ లైన్ వ‌ద్ద గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకున్నాడు. దీనితో రెండు వ‌రుస బంతుల్లో రెండు వికెట్ల‌ను కోల్పోయింది కివీస్‌. అదే ఓవ‌ర్ చివ‌రి బంతికి మ్యాట్ హెన్రీ కూడా వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ చివ‌రి బంతిని లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు హెన్రీ. అది కాస్తా నేరుగా వెళ్లి కేప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల్లో వాలింది. దీనితో మూడు వికెట్ల‌ను కోల్పోయింది.

Story first published: Wednesday, July 10, 2019, 20:22 [IST]
Other articles published on Jul 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X