ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఓ దశలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. తన జీవితంలోనే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నాడు. దాంతో టోర్నీ మధ్యలో ఏడ్చేసానని, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు అండగా నిలిచారని అభిషేక్ శర్మ గుర్తు చేసుకున్నాడు. తనపై తనకే నమ్మకం పోయిన పరిస్థితుల్లో తనను కోచ్, కెప్టెన్ నమ్మారని చెప్పుకొచ్చాడు. వారికి కృతజ్ఞతలు తెలిపిన అభిషేక్ శర్మ.. ఫైనల్లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో భాగమవ్వడంపై సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ మెగా టోర్నీ ఆసాంతం విఫలమైన అభిషేక్ శర్మ.. న్యూజిలాండ్‌తో ఫైనల్లో అసలు సిసలు ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది టీమ్‌మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ జట్టుకు భారీ స్కోర్ అందించింది. ఈ మ్యాచ్‌లో 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. మూడో టీ20 ప్రపంచకప్‌ను గెలవడంతో పాటు వరుసగా రెండో టైటిల్‌ను గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా కూడా చరిత్రను తిరగరాసింది.

ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అభిషేక్ శర్మ.. ఈ టోర్నీలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 'ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దీని గురించి నేను ముందే చెప్పాలనుకున్నాను. కానీ ఈ రోజే దానికి సరైన సమయం. నా మీద మా కెప్టెన్, కోచ్‌కి పూర్తి నమ్మకం ఉంది. నిజానికి నా మీద నాకే అనుమానం కలిగింది. నేను ముందెప్పుడూ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోలేదు. ఈ టోర్నీ నాకు చాలా కష్టంగా సాగింది.
నేను నా ప్రాసెస్ మీద దృష్టి పెట్టి ఒక్కో మ్యాచ్‌ను ఆడుతూ వెళ్లాను. కానీ నేను ఆశించిన రీతిలో నా ఆట సాగలేదు. కానీ నేను ఈ జట్టును ప్రేమిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు అండగా నిలిచిన విధానం అద్భుతం. ఈ ఏడాదంతా అద్బుతంగా ఆడి కీలకమైన టోర్నీలో రాణించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. అయినప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ నా మీద నమ్మకం ఉంచడం గొప్ప విషయం. ఈ టోర్నీ మధ్యలో నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఏడ్చాను కూడా. మా కెప్టెన్, కోచ్ నాతో ఒకటే చెప్పారు: 'నీవే మాకు పెద్ద మ్యాచ్‌లు గెలిపించి పెడతావు' అని అన్నారు. కష్ట సమయాల్లో కూడా ప్రేక్షకులు నాకు చాలా మద్దతుగా నిలిచారు.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.