చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 తేదీలు ఖరారయ్యాయి. వచ్చేనెల 29న 13వ ఐపీఎల్‌కు తెరలేవనుంది. ఇక ప్రతీ ఫ్రాంచైజీ సీజన్-13 కోసం సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త లోగోతో ఈ సీజన్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆటగాళ్లు సురేష్ రైనా, అంబటి రాయుడు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టారు. ఇక అందరి దృష్టి సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీపై నిలిచింది.
గతంలో ఏ క్రికెటర్ చేయని సాహసం.. విజయ్ శంకర్ నువ్ తోపురా (వీడియో)!!
సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ప్రాక్టీస్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. మార్చి 1వ తేదీ నుంచి చెన్నై చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌ను ఆరంభించనున్నాడు. జనవరిలో జార్ఖండ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసిన మహీ.. ఐపీఎల్ కోసం తన ప్రాక్టీస్‌ను మరింత ముమ్మరం చేయాలని చూస్తున్నాడు. మార్చి తొలి వారం నుంచి సీజన్ ఆరంభం అయ్యేవరకు ప్రాక్టీస్ కొనసాగించాలని మహీ భావిస్తున్నాడట. ధోనీతో రైనా, రాయుడులు కూడా ప్రాక్టీస్ చేయనున్నారు.
గత ఏడాది జూలై 9న న్యూజిలాండ్‌తో వన్డే ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక గతేడాది చివర నుండే పలుమార్లు అతడి రిటైర్మెంట్‌పై వార్తలొచ్చాయి. అయితే 38 ఏళ్ల మహీ తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు ఐపీఎల్ వేదికని అంతా భావిస్తున్న నేపథ్యంలో.. మార్చి ఒకటిన చెపాక్ స్టేడియంలో ఎంఎస్ ప్రాక్టీస్ ప్రారంబించనున్నాడు.
తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ధోనీకి ఎంతో క్రికెట్ భవిష్యత్తు ఉందని, అయితే రిటైర్మెంట్‌పై మహీనే ఓ నిర్ణయానికి రావాలన్నారు. 'ధోనీ టీమిండియాకు ఎంతో సేవ చేసాడు. అతడు అద్భుతమైన ఆటగాడు. మహీకి ఎంతో క్రికెట్ భవిష్యత్తు ఉంది. కానీ.. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో అతడే నిర్ణయించుకోవాలి. బీసీసీఐ విధానాల ప్రకారం రిటైర్మెంట్‌పై ఆటగాళ్లే నిర్ణయాలు తీసుకోవాలి' అని రాజీవ్ అన్నారు.