భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైకి చెందిన యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌ను గురువారం అర్జున్ టెండూల్కర్ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
తన అక్క సారా టెండూల్కర్ ఫ్రెండ్ అయిన సానియా చందోక్‌తో సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపిన అర్జున్ టెండూల్కర్.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులోనే అర్జున్-సానియాల నిశ్చితార్థం అత్యంత గోప్యంగా జరిగింది. నిశ్చితార్థం అయిన కొన్ని రోజులకు సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దేశవాళీ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది.

దేశవాళీ క్రికెట్‌లో ముంబై నుంచి గోవాకు మారిన అర్జున్ టెండూల్కర్.. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలే సానియా చందోక్. ఆమె విజయవంతమైన యువ వ్యాపారవేత్తగా.. టెండూల్కర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. సారా టెండూల్కర్‌కు స్నేహితురాలైన సానియా చందోక్.. వయసులో అర్జున్ టెండూల్కర్ కంటే పెద్దది.
సారాతో ఇంటికి వచ్చే క్రమంలో సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్‌కు అయిన పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. అయితే ఈ ఇద్దరూ ఎవరికి అనుమానం రాకుండా ప్రేమాయణం నడిపారంట. సారా టెండూల్కర్‌కు కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డారని వార్తలు వచ్చాయి. వీరి ప్రేమవ్యవహారం తెలిసి సచిన్ టెండూల్కర్ కూడా అవాక్కైనట్లు ప్రచారం జరిగింది.
ప్రముఖ వ్యాపార వేత్త ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జరిగిన చోటే అర్జున్-సానియా పెళ్లి వేడుకలు జరిగాయి. సంగీత్‌లో అర్జున్ సోదరి సారా టెండూల్కర్.. తన డ్యాన్స్‌తో అలరించారు. ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో వధూవరులు ఐవరీ రంగు దుస్తుల్లో మెరిసారు. గురువారం జరిగిన వివాహ వేడుకకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సతీ సమేతంగా ఈ హాజరయ్యారు. మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండే ధోనీ.. ఈ పెళ్లి వేడుకలో చేతిలో ఫోన్‌తో కనిపించాడు.
ఈ వివాహ శుభకార్యానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ఉన్నత స్థాయి నాయకులకు కూడా ఆహ్వానాలు పంపారు. బాలీవుడ్ ప్రముఖులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ దంపతులు సైతం పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. సోషల్ మీడియా వేదికగా అర్జున్ టెండూల్కర్- సానియా దంపతులను సెలెబ్రిటీలు, అభిమానులు ఆశీర్వదిస్తున్నారు.
MS Dhoni and wife Sakshi at Arjun Tendulkar's wedding #MSDhoni #arjuntendulkar pic.twitter.com/oyugLm6AXP
— Arjun (@Arjun13135581) March 5, 2026