'త్వరలోనే ముగుస్తుంది: షమీపై కేసు, దేవుడిని ప్రార్థిస్తున్నా'

Posted By:
Mohammad Kaif hopes the troubled time for Mohammed Shami ends soon

హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణల నుంచి టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ త్వరలోనే క్లీన్‌గా బయటపడతాడని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆశాభావం వ్యక్తంచేశాడు. షమీపై అతడి భార్య చేసిన ఆరోపణలపై ఇప్పటికే మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలు స్పందించారు.

తాజాగా ఈ వివాదంపై మహమ్మద్ కైప్ మాట్లాడుతూ 'షమీపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కాబట్టి, మాట్లాడేందుకు.. ఇది సరైన సమయం కాదు. ఒక్కటి మాత్రం చెప్పలగలను. అతడు నా ఫేవరేట్ ప్లేయర్ మాత్రమే కాదు ఓ గొప్ప ఆటగాడు' అని అన్నాడు.

'ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు షమీకి మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. అతడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. త్వరలోనే తన సమస్యలన్నీ ముగిసిపోవాలని దేవుడుని ప్రార్ధిస్తున్నా' అని పేర్కొన్నాడు. షమీ వ్యవహారంలో మీడియా కూడా అతిగా ప్రవర్తిస్తోందని తెలిపాడు.

'షమీ భార్య మీడియాని సంప్రదించి అన్ని విషయాలు వెల్లడించింది. కాబట్టి ఇద్దరి మధ్య ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ ఓపెన్‌గా తెలిసిపోయింది. ఆ తర్వాత కూడా పరిస్థితులను కంట్రోల్ చేయాలనుకోవడం పొరపాటు. నేను కోరుకునేది ఏమిటంటే, వీలైనంత త్వరగా షమి సమస్యలన్ని పరిష్కారమై తిరిగి ప్రశాంతంగా క్రికెట్ ఆడాలని' అని కైఫ్ వివరించాడు.

ఇండియా ఏ తరుపున వన్డే సిరిస్ కోసం సన్నద్ధం అవుతున్న సమయంలో తనను రెండేళ్లుగా షమి వేధిస్తున్నాడని, తనను చంపించే ప్రయత్నం చేశాడని షమీ భార్య హసిన్‌ జహాన్‌ ఆరోపణలు చేసింది. చాలా మంది అమ్మాయిలతో షమీ వివాహేత సంబంధాలు కలిగి ఉన్నాడని కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు ఆమె చేసిన సంగతి తెలిసిందే.

షమీ భార్య చేసిన ఫిర్యాదుతో అతడితో పాటు కుటుంబ సభ్యులపై కూడా కోల్‌కతా పోలీసులు నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. దీంతో బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి షమీని తప్పించింది. మరోవైపు షమీపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, దుబాయ్‌లో పాకిస్థాన్ మహిళ నుంచి నగదు కూడా తీసుకున్నట్లు గత వారం షమీ భార్య హసీన్‌ జహాన్‌ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్ బాయ్ అనే మధ్యవర్తి ద్వారా పాకిస్తాన్ మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని హసీన్ జహాన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో షమీ మాట్లాడిన వీడియోను హసీన్‌ వెలుగులోకి తీసుకువచ్చింది. షమీ ఫోన్ సంభాషణను సీఓఏ విన్న తర్వాత షమీపై విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ హెడ్‌ నీరజ్‌ కుమార్‌ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి వారంలోగా రిపోర్టు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. పాక్ మహిళ నుంచి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం డబ్బులు తీసుకున్నాడా? లేక ఇతరత్రా అవసరాల కోసమా? అన్నది తమ విచారణలో తేలనుందని బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్ పేర్కొంది.

Story first published: Wednesday, March 14, 2018, 17:04 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి